3382* వ రోజు ... ....           12-Feb-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడబోం! వాడబోం!

నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!

3382* వ నాటి వేకువ సంగతులు!

         ఈ బుధవారం (12.02.2025)అరుణోదయమున అనేకమందికి ఆదర్శవంతంగా నిలుస్తూ మంచును సైతం లెక్కచేయక సుమారు 4.15 ని.. లకు పొగ మంచు కారు చీకటిలో చిన్న చిన్న కాంతి వెలుగులో ఈరోజు శ్రమదానం ప్రారంభం అయ్యింది...

         రోడ్డు కిరువైపులా గుంటలు పడిన రోడ్ మార్జిన్ ను బరంతువేసి బలోపేతం చేయగా మరి కొంతమంది రోడ్లను మూసివేసి నంతగా పెరిగిన కొమ్మలను నరుకుతూ ఉండగా..

         చెట్టు అందాన్ని వెలికి తీయటలో అనవసరంగా పెరిగిన కొన్ని కొమ్మలను కత్తిరించగా రహదారి ఎంతో సుందరంగా మారింది...

         రోడ్లపై ఉన్న చెత్త చెదారం గురించి చెప్పనక్కరలేదు. ప్లాస్టిక్ కవర్లు, మందు సీసాలు వంటివి ఎన్నో వెక్కిరించగా వెలికి తీసి ఒక సంచిలో వేయడం జరిగింది..

         శ్రమదానములో దాదాపు 34 మంది వరకు పాల్గొనగా వారిలో వెంకటాపురం, శివరామపురం నుండి కొందరు బడి పిల్లలు శ్రమను పంచగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఐదో తరగతి చదివే బుడతడుకు ఉన్న ఆలోచన స్ఫూర్తి తక్కిన వారికి లేనందుకు చింతిస్తూ వారు చేసిన శ్రమదానం చూసి కష్టం సైతం మరిచిపోయేంత సంతోషాన్ని కార్యకర్తలు కలిగి ఉండటం విశేషం.

         మేకలడొంకలో ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరి ఇద్దరు శ్రమించి పిచ్చి మొక్కలు తొలగించగా సుందరంగా ఉంది..

         శ్రమదానం తర్వాత రోడ్డును చూడగా  స్వర్గ ద్వారంలాగా పచ్చని  చెట్లతో పసందైన అనుభూతిని కలిగించింది...

         9వ తరగతి చదువుతున్న వెంకటాపురం బాలుడు జేజేలు కొట్టగా చేసిన కష్టమును మరిచిపోయేంతగా డాక్టర్ గారు ప్రశంసలతో ఈరోజు శ్రమదానం ముగిసింది..

         ప్రాత స్వచ్చ కార్యకర్త రావూరి సూర్యప్రకాశరావు గారు స్వచ్చోద్యమానికి 25,000/- రూపాయల విరాళమందించినందుకు ధన్యవాదములు!  

         రేపటి మన కలయిక వెంకటాపురం రోడ్డులోనని తీర్మానించడం జరిగింది..

- డేవిడ్ గోల్కొండ

         ఇందరున్నతోద్యోగులు (SBI)

సజావుగా జరుగు గ్రామ శ్రమ వేడుక చూసేందుకు –

ఒక్కమారు – ఒక్క గంట శ్రమలో పాల్గొనేందుకూ –

ఇందరున్నతోద్యోగులు (SBI) ఇంత దవ్వు రావడమా!

బ్రతుకు ధన్యమైనట్లుగ భావిస్తూ వెళ్లడమూ!

- నల్లూరి రామారావు

   12.02.2025