3383* వ రోజు ... ....           13-Feb-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడబోం! వాడబోం!

నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!

3383* వ నాటి వేకువ సంగతులు!

         ఈ గురువారం(13.2.2025) గగనము నుండి చల్లని పొగ మంచు జాలువారుతున్నా పట్టించుకోకుండా పనిముట్లు పట్టుకుని సరిగ్గా 4:22 కి ఈరోజు శ్రమదానం ప్రారంభమైనది..

         కొమ్మలు, రెమ్మలు విపరీతంగా పెరిగి పెద్దవై దట్టమైన అడవి లాగ తయారవ్వగా ఆకాశానికి నిచ్చెన వేసినట్లు పొడవాటి కత్తెరతో వాటిని అందముగా తీర్చిదిద్దటం చూసే వాళ్లకు వింతగా ఉన్నది.

         ఈరోజు శ్రమదానం 35 మంది కలిసి పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ఎండిన ఆకులు అలములు ఎత్తి  ట్రాక్టర్లో వేయటం జరిగింది..

         రోడ్డుకు ఇరువైపులా ఎత్తు పల్లాలను సరి చేయుటకై మట్టిని సమకూర్చి రోడ్డుకి రక్షణగా వేశారు..

         వెంకటాపురం వాస్తవ్యులైన ఏడుగురు  బాల సైన్యం చలిలో, చిన్ని చేతులతో, పెద్ద మనసుతో మేము సైతం అంటూ ముందుకు రావడం చూసి కూడా కొందరు పట్టనట్టు ఉండటం ఆ ఊరి పెద్దమనుషులకు తగునా?

         బడి పోరడు పి కార్తీక్ నినాదించగా, దేసు ప్రభాకర్ రావు జన్మదిన సందర్భంగా మాధురి గారు 1000/- విరాళం అందించగా, డాక్టర్ గారు ఈరోజు పనిని వివరిస్తూ పండుగ వరకు పండగలా పని చేద్దాం అని తెలుపుట సంతోషం.

         రేపటి మన కలయిక వెంకటాపురం రోడ్డులోనే అనుకున్నారు.

-మీ... డేవిడ్ గోల్కొండ

         యువశక్తిని విస్తుపోయి వీక్షించితి

ఒక డేవిడ్ గోలుకొండ, ఒక భరతుడు, నిరంజనుడు

మలాటుతో , పలుగులతోకాంక్రీట్ మహారణ్యంలో

వీర విహారం చేస్తూ విజేతలుగ నిలవటాన్ని

వీక్షించితి,యువశక్తిని విస్తుపోయి గమనిస్తిని.

-నల్లూరి రామారావు

  13.02.2025