3384* వ రోజు ... ....           14-Feb-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు!

నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

3384* వ నాటి శ్రమ కూడ శివరాంపురం వద్దే!

         14.02.2025 – శుక్రవారం వేకువ 4:18 కే మొదలైన సామాజిక బాధ్యతలు 6:22 కి గాని ముగియలేదు. అందులో 26 గురి కష్టం కొలిమి షెడ్డు ప్రాంతంలోనూ, ముగ్గురి సుందరీకరణలు సంత వీధిలోనూ, ఉపాధ్యాయ వృత్తుల ఇద్దరి ప్రయత్నాలు మేకలడొంక – న్యూట్రిఫీడ్ దగ్గరా జరిగాయి!

         హద్దులు తప్పి, విరుచుకుపడుతున్న హిమపాతమేమిటో – దానికి తోడుగా చలిగాలేమిటో – రెండేసి, మూడేసి కిలోమీటర్లు దాటుకుని పని చోటులకు చేరుకోవడమెలాగో – అననుకూలతల్ని సానుకూలతలుగా మలచుకొంటూ 31 మంది 50 పని గంటల సమయ త్యాగమేలనో – గ్రామస్తుల్లో ఎందరాలోచిస్తున్నారు?

         పదకొండేళ్ళుగా కార్యకర్తల్తో మమేకమై సంచలిస్తున్న నాకు మాత్రం ఈ స్వచ్చ – సుందర కర్మలు ఏరోజుకారోజు ఒక పొడుపు కధలాగే అనిపిస్తవి!

         కాంక్రీటు దిమ్మల్నీ, స్తంభాల్నీ బ్రద్దలు కొడుతున్న నలుగురు యువకుల బల ప్రదర్శనను గమనించాను, మినపపొలం అంచు దాక వ్యర్ధాల్ని ఏరి, 3 రకాలుగా –

1) గాజు

2) ప్లాస్టిక్

3) బొత్తిగా పొడి చెత్తలుగా విభజించిన - విడిగా సంచుల్లో నింపిన పిల్ల కార్యకర్తల్ని మనసులోనే అభినందించాను;

         సరైన ఫోటో తీయడానికి వీల్లేకుండా మంచు వర్షం అడ్డొస్తుండగా - తూము వారి చిరాకును అర్థం చేసుకొన్నాను.

         మొత్తమ్మీద – అర కిలోమీటరు బారునా - ప్రతికూల పరిస్ధితిలో 2-3 రకాల శ్రమ విభవాన్నీ, ఆరుంబావుకు వచ్చిన కాస్తంత వెలుగులో తమ శ్రమఫలితంగా ఈ వీధి ఎంత అందంగా మారిందో చూస్తూ తృప్తి చెందుతున్న స్వచ్చ కార్యకర్తల ముఖాల్ని పరిశీలించాను.

         నిన్న ఈ వీధిని “స్వర్గ ప్రవేశ ద్వారంగా” డేవిడ్ వర్ణించినది గుర్తు చేసుకున్నాను!

         తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కోడూరు వేంకటేశ్వరరావు గారు 1000/- రూపాయల విరాళం స్వచ్చోద్యమం కోసం ఇచ్చారు.  

         ప్రక్క ఊరికి విన్పించేలా నినాదాల్ని ఆయన కాక ఎవరు గద్దించగలరు!

         రేపటి శ్రమ స్థలం నేటి పనులు ముగిసిన (శివరాంపురం రోడ్డు) చోటేనట!

   అందుకు మినహాయింపు కాదు!

కాలుష్యం రక్కసి పెను కోరలో ఇరుక్కుని

రాజధాని ఢిల్లీలో బ్రతుకు ఛిద్రమౌతున్నది

ముంబయి కలకతాల్లోను పంబరేగి పోతున్నది

అభాగ్యనగరం సైతం అందుకు మినహాయింపు కాదు!

- నల్లూరి రామారావు

  14.02.2025