సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు!
నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
ఈ శనివారా (15-2-25) నిది 3385*వ పని దినం!
ఇక – గ్రామ సేవకు దిగిన స్వచ్చ కార్యకర్తలైతే 46 మంది ! సేవల తొలి, తుది వేళలు 4:13, 6:20! పని చోటులు -
1) సంత వీధిలో 5 గురూ,
2) మేకలడొంకలో 3 గ్గురూ,
3) శివరాంపురం రోడ్డులోని కొలిమి షెడ్డు దగ్గరైతే – 38 మందీ!
ఇంత సందడిని చూసి, శ్రమదాన కోలాహలాన్ని చూసి, కళ్ళు కుట్టినవేమోగాని, భారీ పొగ మంచు తన అక్కసు వెళ్లబోసుకున్నది! రహదారి కాలుష్యాలతోబాటు మంచు వైపరీత్యంతో కూడ కార్యకర్తలు యుద్ధం చేయవలసి వచ్చింది.
“అసలింతటి స్వార్ధరహిత సామాజిక కర్తవ్య దీక్షనూ శ్రమ సందడినీ - చేయడం సరే – చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి!
పాపం - DRK - పద్మావతి దంపతులకు నేటి చివరి ½ గంట శ్రమ వింతల్ని చూడడం కుదర్లేదు! 2-3 కిలోమీటర్ల దూరాన సంత వీధిని రంగురంగుల బొమ్మల్తో అలంకరిస్తున్న శ్రమ వైచిత్ర్యాన్ని నేనూ చూడలేకపోయాను!
ఈ వేకువ సమయాన నేను చూడనోచిన దృశ్యాలివి:
1) ముగ్గురు యువ యోధుల మలాటు పోటులకు పగిలి, ఎగిరిపడుతున్న కాంక్రీటు దిమ్మల ముక్కలు,
2) పడమటి డ్రైనులో కాంపౌండరు, రైతు, నర్సులు 10 మంది 50 గజాల మేర తుక్కులు లాగి, ఎండు కొమ్మలు నరికి, 2 గోతాల సగం ఎండిన కొబ్బరి బొండాల వ్యర్ధాల్ని తొలగించే పనులూ,
3) ఒక వర్తక కార్యకర్తా, మరో గృహిణీ సేకరించిన 2 గోనె సంచుల గాజు, ప్లాస్టిక్ సీసాలూ,
4) కొలిమి షెడ్డు దగ్గర మట్టిలోనే కూర్చుని, తాపీగా కొడవళ్ళతో పనిచేసుకుపోతున్న ఒక BSNL, మొన్న గాయపడ్డ వ్రేళ్ళతోనే శ్రమిస్తున్న కస్తూరి సోదరులూ,
5) ఏడెనిమిది మంది బాల కార్యకర్తల పని వేగమూ,
6) వీధిని శుభ్రపరుస్తున్న 6 గురు చీపుళ్ళ మహిళా కార్యకర్తలూ,
7) న్యూట్రిఫీడ్స్ వద్ద శ్రమిస్తున్న ఇద్దరు బడి పంతుళ్ళను దూరంగా ఉండి మాత్రమే చూశాను!
6.40 కి జరిగిన తుది సమావేశాన్ని తన నినాదాలతో ప్రారంభించినది మెకానిక్ భరతుడూ, ఐదుగురు పంచాయతి సిబ్బంది ప్రవేశమూ, 6:50 కి ముగింపూ!
రేపటి రహదారి బాధ్యతలు కొలిమి - పంట కాల్వ వంతెనల మధ్యనే!
‘దేనికింత తప’నంటే
‘ఎందుకింత శ్రమ’ అంటే – ‘దేనికింత తప’నంటే
‘మరీ ఇంత త్యాగ బుద్ధి మనకవసరమా’ అంటే :
“ఒక గాంధీ – మరొక చండ్ర - ఒక పుచ్చలపల్లి సుంద
రయ్యల జీవిత చరితల నవలోకించం”డని చెప్పెద!
- నల్లూరి రామారావు
15.02.2025