సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు!
నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
ఆదివారం (16.02.2025) నాటి కార్యకర్తల హాజరు – 39 - @3386*
పనులు జరిగింది శివరామపురం దగ్గరి కొలిమి షెడ్డుకు దక్షిణోత్తరాలుగానూ, మేకలడొంకలో న్యూట్రిఫీడ్స్ వద్దనూ, ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరాన సంత వీధిలోనూ! పని సమయం 2 గంటల 10 నిముషాలు!
పనులు 3 చోట్లయినా, ఎవరి అభిరుచి కనుగుణంగా వారికి ఇష్టమైన పనిముట్లతో ఏ ప్రయత్నాలు జరిగినా, కార్యకర్తల ప్రస్తుత గమ్యాలు రెండే –
1) సంత కూరల పనిమీదో, రైతు బజారుకో వచ్చివెళ్లే ప్రాంతమంతా శుభ్రంగా ఉండాలి, అడుగడుగునా అందాలొలకాలి.
2) శివరాత్రి పండుగ నాటికి 3 కిలోమీటర్ల పెదకళ్లేపల్లి రోడ్డు వేలాది భక్తులకు కనువిందు చేయాలి.
అందుకు గడ్డి కోయవలసినా, చెట్లనలంకరించే పని పడినా – నీళ్ళ, సారా నీసా లేరేందుకైనా, దుమ్ము, ఆకులు ఊడవడానికైనా – చివరికి పేడ – పెంటలెత్తడానికైనా స్వచ్ఛ కార్యకర్తలు సంసిద్ధులే! పది – పదకొండేళ్ల నాడే వాళ్ళు ఆ మేరకు భీష్మించుకున్నారు!
గజగజలాడించే చలి ఊపులకూ, వాన బెదిరింపులకూ వాళ్ళేనాడు పనులాపారు? ఇప్పటికీ గ్రామ స్వచ్చ సౌందర్య భావనలకలవాటు పడని 30-40 శాతం గ్రామస్తులు మారే దాకా - ఒక సమష్టి చైతన్యం వెల్లివిరిసే దాకా స్వచ్చ కార్యకర్తల దీక్ష ఆగదు!
మంగళాపురం నుండి కార్మిక దంపతులు, రామానగరం నుండి - శివరాంపురం, చల్లపల్లి ఊళ్ళ నుండి ఇందరు ఇంత చలీ మంచుల వేకువలో వచ్చి శ్రమించడమే స్వచ్చ – సుందర - చల్లపల్లి శ్రమదానోద్యమ విజయం!
150 గజాల రహదారి మార్జిన్లు శుభ్రపడ్డాక – డ్రైన్ల వ్యర్ధాలు తొలగాక - సంత వీధి గోడలు అద్భుత చిత్రాలను సంతరించుకొన్నాక - 6.30 కు కూడ సరిగా వెలుతురు చాలని సమయాన -
RTC వాహన చోదకుడు తోట నాగేశ్వరరావు నినాదాలతో తుది సమావేశాన్ని రక్తికట్టించగా –
రేపటి శ్రమదానం కోసం P.K. పల్లి బాటలోని పంటకాల్వ వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకొని అందరూ గృహోన్ముఖులయ్యారు!
ఒక సంచిత పుణ్యంలా
ఒక పుష్కర కాలంగా - ఒక పవిత్ర యజ్ఞంలా
ఒక సంచిత పుణ్యంలా - మన వేకువ సమరం ఇది
శాఖలు ఉపశాఖలుగా ఇది దేశ వ్యాపితమై
కాలుష్యం అంతు చూడగలదని అనిపిస్తున్నది!
- నల్లూరి రామారావు
16.02.2025