3387* వ రోజు ... ....           17-Feb-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు!

నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

సోమవారం (17-2-25) నాటి శ్రమ కథా చిత్రం! - @3387*

         అది మరొకమారు క్రొత్త శివరాంపురం దగ్గర పంటకాల్వ సమీపానే జరిగినది; 25(+1-మండవ శేషగిరిరావు) మంది పాల్గొనినది; మంచు వదలని 6.20 దాక 2 గంటలపాటు 4 రకాల శ్రమ విన్యాసాలు ప్రదర్శించినది!

         మంగళాపురం నుండీ, రామానగరం, చల్లపల్లి, శివరామపురాల నుండి తప్ప అక్కడి పాకలవారెవ్వరూ తొంగి చూడనిది! ఒకానొక పెద్ద కారణం వల్ల వెంకటాపురం పాఠశాలోపాధ్యాయిని+7 గురు పిల్లలు పాల్గొనలేనిది! సుందరీకరణ బృందం కూడ రానందున కార్యకర్తల సంఖ్య పడిపోయి, పరిమితంగా మాత్రమే జరిగిన సామాజిక బాధ్యతాంశమది!

పాతిక మంది కష్టంతోనే జరిగిన 4 రకాల పనులివి:

- బాగా కష్టమైన, సంక్లిష్టమైన పనైతే పెదకళ్లేపల్లి రహదారి పడమర డ్రైనులో జరిగినదే! 100 కు పైగా 3 తాడి చెట్ల ఎండి - వికృతంగా వ్రేలాడుతున్న మట్టల్ని తప్పించి, రోడ్డు పైకి గుంజి తూర్పు మినప చేను గట్టున కంచెగా పేర్చడం దారిన బండ్ల మీద పోయే వాళ్లకేం తెలుస్తుంది  ఎంత బరువు పనో!

- రోడ్డు తూర్పుగానే దొరికిన మన్నుతోనే బరంతు పేర్చి, రోడ్డు మన్నికను పెంచే ప్రయత్నం ఎంత దూరదృష్టో గదా!

- చీపుళ్లతో బాటనూ, మార్జిన్లనూ ఊడ్వడం సరే - తాటి మొద్దుల మధ్య గల ఆకులలముల్నీ, పుల్లా పుడిగినీ బైటకు లాగి , డిప్పలకెత్తి, ట్రాక్టర్ లో నింపడానికి - రహదారి శుభ్ర- సౌందర్యాల పట్ల ఎంతటి నిబద్ధత ఉండాలి?

- ఎక్కడెక్కడి క్రుళ్లు కంపు వ్యర్థాల ప్లాస్టిక్ సంచుల్ని విప్పి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లనీ, గాజు బుడ్లనీ విడిగా సంచులకెత్తుతున్న షణ్ముఖ వ్యాపారిని గమనించండి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తంటే ఏమిటో తెలుస్తుంది!

         ఇలా నేను ప్రతి వేకువా జరిగే చర్యల్ని స్థూలంగానే - పరిమితంగానే వ్రాయగల్గుతున్నాను. ఎవరి చేతులు ముళ్లతో - గాజు  పెంకుల్తో గీసుకుపొతున్నవో వంటి వివరాలు చెప్పలేకపోతున్నాను!

         ఎట్టకేలకు 6:20 కి పని ముగించి, వంతెన వద్ద గట్టు వద్ద నిలిచి, మొవ్వ అమెరికా ప్రవాసి మండవ శేషగిరిరావు గారు నినదించిన శ్రమదాన సారాంశాన్ని ప్రశంసించి,

         రేపటి వీధి శ్రమ కోసం శివరాంపురం పంట కాల్వ వంతెన వద్దనే కలవాలని నిర్ణయించారు!

         ఔనండీ! ఇది నిజమే!

ఔనండీ! ఇది నిజమే! అది వర్షము కాదు మంచు!

ఊరికి కడుదూరముగా ఉన్నది కదళీపుర మార్గము!

40 మందికి పైగా పలురకాల మురికి పనులు

చేస్తున్నది డాక్టర్లూ - పంతుళ్లూ - గృహిణులు!

- నల్లూరి రామారావు

  17.02.2025