3388* వ రోజు ... ....           18-Feb-2025

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు!

నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

33 88* వ (18-2-25 - మంగళవారపు) శ్రమాధ్యాయం!

         మాట వరసకి - జిజ్ఞాసాపరుడూ, సుహృదయుడూ ఐన ఒక అగంతకుడు అనుకోకుండా ఈ వేకువ 5:00 కు పెదకళ్ళేపల్లి మార్గంలోని శివరాంపురం వంతెన దగ్గరకొచ్చాడనుకొందాం! గంటకుపైగా 29 మంది కార్యకర్తల పారిశుద్ధ్య కార్యక్రమంలో అతని అనుభవాలిలా ఉండవచ్చు!

         - వీరిలో డజను మంది 4:20 కే 3 కిలోమీటర్లు దట్టమైన మంచు తెరల్ని ఛేదించుకొని వచ్చారనీ, రహదారి కాలుష్య దరిద్రాల మీద యుద్ధం మొదలెట్టారనీ అడిగి తెలుసుకొంటాడు!

- మేకలడొంక దగ్గర కాంక్రీటు దిమ్మెల్ని మలాటుతో ముక్కలు కొడుతున్న సతీషునూ, వాటిని డిప్పల్తో మోనుకుపోతున్న దేసు మాధురినీ, చెలరేగుతున్న సున్నం ధూళినీ పీలుస్తూ పనిలో పరవళ్ళు త్రొక్కుతున్న ఇద్దరు ప్రసాదుల్నీ ఆశ్చర్యంతో చూస్తాడు!

- వంతెన దిశగా ముందుకు వెళ్తే పడమటి డ్రైనులో చిట్టడివిని కత్తుల్తో ఛేదించి, సమస్త కశ్మలాలతో సహా రోడ్డు ప్రక్క గుట్టలుగా పేరుస్తున్న బృందావనాది డజను మంది పనిని గమనిస్తాడు!

- అదే రోడ్డు తూర్పు మినప పొలం దగ్గర కొడవళ్లతో తాటి మొక్కల్నీ, గడ్డినీ సమూలంగా లేపి, ఊడ్చి, సంతోషిస్తున్న అంబటి శంకరాదులైదారుగురి కార్యదీక్షకు పొంగిపోతాడు!

- వేంకటాపురం బడి పిల్లలూ, నాగలక్ష్మి, మెండు శ్రీను తదితర పారిశుద్ధ్య యోధులు పంట కాల్వ వంతెనను సొంతింటిని శుభ్రపరిచినట్లు ఎలా చేయగలుగుతున్నారా అని సందేహిస్తాడు!

- 2 గంటల శ్రమదానాన్ని పర్యవేక్షిస్తూ, జరుగుతున్న స్వార్ధరహిత - కష్టతర రహదారి సుందరీకరణకు సంతసిస్తూ, రేపింకా ఏమి చేయాలో ఆలోచిస్తున్న DRK వైద్యుడిని పరిచయం  చేసుకొంటాడు!

         కార్యకర్తలతో కలిసి, కాఫీ సేవించి, చేసిన మురికి పనులను చూసుకొని ఆనందిస్తున్న వాళ్ళ ఆంతర్యాలను అంచనా వేసి, చురుకైన వ్యవవసాయదారుడు మల్లంపాటి ప్రేమానందుడు ప్రకటించిన చల్లపల్లి స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలకు బదులిచ్చి, ఇదేదో ఒకటి రెండు రోజుల వ్యవహారం కాదనీ, 11 ఏళ్ళ ప్రస్థానమనీ గ్రహిస్తాడు - వీలైతే తాను కూడ స్వచ్చ  కార్యకర్తగా మారినా మారతాడు!

         చివరగా కిలోమీటర్ పైగా శివరాంపురం రోడ్డు ఇంత పచ్చగా, శుభ్రంగా, చూడముచ్చటగా ఉన్నదంటే అది కార్యకర్తల ఎడతెగని శ్రమ ఫలితమేనని కూడా అంగీకరిస్తాడు!

         రేపటి శ్రమదానం కూడ క్రొత్త శివరాంపురం వద్దనని అతనికి తెలిసిపోతుంది!

         తీర్థయాత్రల కొచ్చినట్లుగ

ఎక్కడి శివరామపురము - ఎక్కడ మీ చల్లపల్లి?

ఎందుకిందరు కార్యకర్తలు తీర్థయాత్రల కొచ్చినట్లుగ

చెత్త ఊడ్చుట - మురుగు తోడుట రోడ్ల గుంటలు పూడ్చివేయుట?

సంత వీధి నలంకరించుట - సొంత పనులను దాట వేయుట?

- నల్లూరి రామారావు

  18.02.2025