3422* వ రోజు....           24-Mar-2025

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

   పాగోలు మార్గంలోనికి వీధి శ్రమ పునః ప్రవేశం!-@3422*

         ఇది సోమవారం (24-3-25) నాటిది! 9 మంది తొలి శ్రమదాతల బృందంతో 4.20 - 6.12 నడుమ ప్రారంభమై, చిట్ట చివరగా - 6.00 కి వచ్చిన ట్రస్టు ఉద్యోగి శాయి బాబు 27 వ వాలంటీరుగా ముగిసినది.

         శ్రమదాతలీపూట ఆగినది NTR పాఠశాల ముఖ ద్వారం చప్టా వద్ద! కాని, పారిశుద్ధ్య   పనులు జరిగింది మాత్రం అక్కడి నుండి చల్లపల్లి దిశగా 100 గజాల దాక! సాధ్యమైనంత వరకు కార్యకర్తల కరవాలములు బాట ఉత్తరపు చెట్ల జోలికి పోలేదు. 17-18 మందీ పాటుబడినది బాట ఉత్తరపు మార్జిన్లు మరియు మురుగు నీటి కాలువ అంచుల్లోని ఎందుకూ పనికిరాని కలుపుల - పిచ్చి మొక్కల పని బట్టడానికే!

         ఈ వేకువ కాలపు శుభ్ర సుందరీకరణమైతే 100  గజాల పైగా జరిగింది గాని, దక్షిణపు దిశగా పెద్ద చెట్ల కొమ్మలూ, డ్రైను లోని ఎండు తుక్కులూ, ముళ్ళ కంపలూ  తొలగిపోయి, 2 గుట్టల పచ్చి+ఎండు తుక్కు పోగులక్కడ తయారయ్యాయి గాని – ఏవో లోపాలు కనపడుతున్నాయి.

         ముఖ్యంగా ఉత్తరపు భాగంలో పాచ్ వర్కుల్లాగా అనిపిస్తున్నవి తప్ప పరిశుభ్రతలో నిండుదనం రాలేదు. అదీ గాక వీధి 2 ప్రక్కలా తయారైన వ్యర్ధాల లోడింగూ,  తరలింపూ కుదరక ఆ బాధ్యత 7-00 తరువాత ట్రస్టు కష్ట జీవులకు వదిలి వేయబడింది! అక్కడికే బారెడు ప్రొద్దెగ బ్రాకి, చురచురమనిపిస్తున్నది- చెమట శరీరాలకు!

         అందుకనే రేపు కూడ ఇవాళ జరిగిన చోట శ్రమిస్తేనే గాని కార్యకర్తలకు పూర్తి సంతృప్తి దొరకదు! మహిళా శ్రామికులు ముగ్గురే ఐనా,  బజారు ఊడ్పులో ఏ వెలితీ కనపడలేదు.

          6.30 కు ముగిసిన చివరి సరదా – సమీక్షా సమావేశాన్ని తన నినాదాలతో ప్రారంభించినది మాలెంపాటి డాక్టరు గారు, అందరూ మెచ్చే క్వొటేషన్స్ "మన డాక్టరు గారికీ – డాక్టరమ్మ గారికీ..." అంటూ మొదలెట్టినది అడపా గురవయ్య గారు.

 రేపటి వేకువ పనులు NTR పాఠశాల దగ్గరనే  అని అంగీకరించినది ఏకగ్రీవంగా !

  ప్రజారోగ్య రక్షణకొక బాసటగా

ఎవరు చెప్పగలరు -చల్లపల్లి సుందరోద్యమమే  

మరొక దశాబ్దంపైగా మనుగడ సాగించునేమొ!

దేశంలో పారిశుద్ధ్య దీప్తులు వెదజల్లునేమొ!

ప్రజారోగ్య రక్షణకొక బాసటగా నిలుచునేమొ!

- నల్లూరి రామారావు,

   24.03.2025.