3424* వ రోజు ....           26-Mar-2025

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

బుధవారం 55 గంటల శ్రమ కూడ పాగోలు దారికే సమర్పితం – 3424*

         26.3.25 వేకువ 4.18 కే మొదలై, 6:16 నిముషాల దాక విజయవంతమైన శ్రమానందమది! మరొకమారు NTR పాఠశాల ముఖద్వారం కేంద్రంగా కుడి ఎడమల 150 గజాల నిడివిలో కాలుష్యాల, అంద విహీనతల, అశుభ్రతల భరతం పట్టిన దృశ్యమది!

         42 మంది! గ్రామ సమాజం యోగక్షేమాలు పట్టించుకొనే వివిధ వయసుల – గ్రామాల - జిల్లాల - రాష్ట్రాల కార్యకర్తలొక్కచోట – ఒకే లక్ష్యంతో కృషి చేసే అరుదైన సన్నివేశమది! ముఖ్యంగా తమిళ - మిజోరం రాష్ట్రాల నుండీ, కాకినాడ నుండీ కేరళ బైబిల్ కళాశాల విద్యార్థులు డేవిడ్ గోల్కొండ గారి శిక్షణలోని 5 గురు పాల్గొనడంతోనే నేటి పని వారల సంఖ్య ఇంతగా పెరిగింది!

         ఒక దశలో – అంటే 5:45 సమయాన “ఇది పాగోలు మార్గ కాలుష్య పోరాటమా, సుప్త సామాజిక సంక్షేమం కోసం ఆరాటమా లేక మన దేశం ఎన్నడో మరచిన సామాజిక బాధ్యతా పాఠ్యాంశమా...అనే సందేహం కలిగింది. లేకపోతే -

- ఐదారేడుగురు మహిళలు ఊరికి దూరంగా వీధి ఊడ్పుల్లో పాల్గొనడమేమిటి?

- తమ మినప పొలం ఫల సాయం కోసం త్వరపడే రైతులు రెండేసి గంటలు ఒక పాఠశాల వద్ద వీధి అందచందాలకు ప్రయత్నించనేల?

- ఆటో తోలుకొనే నాగరాజు, పంచాయతి పనుల్లో మునిగి తేలే సర్పంచి, వయోధికులు, వ్యాపారులు, నర్సులు, చేసుకొనేందుకు సొంత పనుల్లేకనా ఇక్కడి డ్రైన్ల తీరుతెన్నులకు పాటుబడేది?

- ఎవరైనా పురమాయిస్తేనూ, బ్రతిమాలితేనూ, మాయచేస్తేనూ ప్రలోభపెడితేనూ జరిగే పొరుగూరి పారిశుద్ధ్యమా ఇది?

- స్వయం స్ఫూర్తిమంతులు కాకుండా ఇన్నేళ్ళ శ్రమదానం కుదిరే పనేనా?

         బైటి వాళ్లు సరే - కార్యకర్తల్లో ఒకరిద్దరు గతంలో అనడం విన్నాను – “ఈ డాక్టర్లిద్దర్నీ 10-15 రోజులు ఈ పనులు మానేయనీయండి – చూద్దాం - ఈ శ్రమదానమనేది మిగుల్తుందేమో....” అని!

         ఐతే-అందుకు భిన్నంగా-అదేం చిత్రమో గాని DRK డాక్టరు భౌతికంగా చల్లపల్లిలో లేనప్పుడే కార్యకర్తల సంఖ్య, పని వేగమూ పెరుగుతున్నది!

         నేటి విస్తృత శ్రమదానమేమిటో-తత్ఫలితంగా బాట ఉత్తర దక్షిణాల్లో ఏం మార్పులు జరిగాయో-అక్కడ నిన్న లేని అందాలెందుకు ప్రత్యక్షమయ్యాయో 150 గజాల దారిని చూస్తే తెలియడంలా? నేను పని గట్టుకొని వ్రాయాలా?

         6.40 దాక బడి గేటు ఎదురుగా జరిగిన సమావేశం-

         పాస్టరు డేవిడ్ గారి నినాదాలతో మొదలై, నేటి కృషి పట్ల సంతృప్తి ప్రకటితమై,
         ‘రేపటి శ్రమకు కూడ పాగోలు మార్గమే వేదిక’ అనే నిర్ణయంతో ముగిసింది.

                  అదైన తెలుసా?

ఐకమత్యపు బలం తెలుసా? అందరొకటై నిలిచి ఊరికి

చేయు సేవల విలువ తెలుసా? చిత్తశుద్ధితొ దశాబ్దంగా

జన స్వస్తత కోరి చేసే సవనముంది - అదైన తెలుసా?

కార్యకర్తగ మారిపోతే గౌరవం చేకూరు తెలుసా?

- నల్లూరి రామారావు,

   26.03.2025.