3425* వ రోజు ....           27-Mar-2025

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

3425* వ శ్రమ వేడుకలోనూ 41 మంది!

         అలాగే గురువారం (27.3.25) వేకువ వీధి పనులు కూడా పాగోలు బాటలోనే జరిగాయి! వాహన నిలుపుదల జాగా కోసం NTR పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఆగారు తప్ప – నిన్ననే అక్కడి నుండి పడమరగా శ్రమదాన పురోగతి కన్పించింది. ఈ పూట మాత్రం ఇంచుమించు బాట మలుపు దాక పన్లు వ్యాపించాయి.

         ఐదారుగురు పర్ఫెక్షనిస్టులు మాత్రం మరొకమారు గేటుకు తూర్పుగా సరిక్రొత్త కాలుష్యాల మీద దండెత్తారు. ఊడ్చిన 10 డిప్పల తుక్కూ, మరికొన్ని గాజు - ప్లాస్టిక్ సామాన్లు వాళ్ళ సంపాదన!

         మరయంత్రం చక్రం కోరలకు పదును పెట్టి తేవడం లేటయింది గాని - దక్షిణపు పూల - నీడ చెట్ల సుందరీకరణం రోడ్డు మలుపు దాక వెళ్లేదే!

         మొత్తమ్మీద నేటి పని పద్ధతీ, కాలుష్య విముక్త పురోగతీ బాగున్నాయి. డేవిడ్ గోల్కొండ గారి 6 గురి టీమూ –

1) 26 ఏళ్ల చోచో (మిజోరం)

2) శివ బాలన్ (తమిళనాడు)

3) అస్రెల్లా (తమిళనాడు)

4) శామ్యూల్ (కాకినాడ)

5) మరొక స్థానికుడూ,

6) నారాయణరావు నగర్ పాస్టరు గారూ “చెట్టు మీది ఉసిరికా, సముద్రంలో ఉప్పూ....” అన్నట్లుగా పాగోలు గ్రామ సేవలకు పూనుకోవడం ముదావహం!

         ప్రాంతం దృష్ట్యా ఇది చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం కావచ్చు గాని, స్వభావం-ప్రయోజనం రీత్యా ఇది జాతీయ ఉద్యమమే! ఎక్కడెక్కడివారో ఆసక్తిగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరతలను చూసేందుకు రావడమూ, వేకువ శ్రమదానంలో పాల్గొనడమూ పరిపాటే మరి!

         నిన్నటిలాగే నేడు కూడ ట్రస్టు ఉద్యోగులకు గంగులవారిపాలెం వీధిలో పనులున్నందున - నిన్నటి నేటి చెట్ల కొమ్మలూ, తాటి మట్టలూ, షెడ్డర్ లో దూరలేదు!

         నినాద అవకాశం దక్కించుకొన్న దేసు మాధురి జలుబు చేసినా గట్టిగానే చెప్పి, ఛాన్సును సద్వినియోగించుకొన్నది!

         ఇవీ - గురువారం నాటి 2 గంటల వీధి మెరుగుదల పనుల వివరాలు..

         రేపటి, శనివారపు శ్రమదానాలు కూడ పాగోలు బాట తొలి మలుపు వద్ద నుండే జరుగనున్నవి!

         ఎంత నమ్మకమో!

దేశాగ్ర నేత లెప్పుడైన ఈ ఊరు రాక తప్పదనీ

మరో దశాబ్దానికైన మార్పురాక మానదనీ –

ముందుగ ఈ ఊరాపై మొత్తం రాష్ట్రం - దేశం

మార్పు పట్ల స్వచ్ఛ కార్యకర్త కెంత నమ్మకమో!

- నల్లూరి రామారావు,

   27.03.2025.