3431* వ రోజు ....           02-Apr-2025

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించొద్దని ప్రతినబూనుదాం స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ స్ఫూర్తితో పర్యావరణాన్ని మనం పరిరక్షిద్దాం.

స్వచ్ఛ సుందర చల్లపల్లి 3431* వ రోజు శ్రమదాన ఘట్టాలు.

            ప్రతి రోజూ జరుగుతున్న శ్రమ యజ్ఞంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ సేవ పాగోలు రోడ్డు మలుపులో 4:20 నిమిషాలకు 9 మందితో ప్రారంభమయింది. చల్లపల్లికి నాల్గు దిక్కులూ ఉన్న ప్రధాన రహదారులలో ఒకటైన పాగోలు రోడ్డును స్వచ్ఛ కార్యకర్తలు శ్రమతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన సంగతి జగద్విదితం.

            పచ్చని చెట్లతో సుందర శోభాయమానంగా ఉన్న ఆ రహదారికి మరింత మెరుగులు దిద్దుతూ దారికి రెండు ప్రక్కలా చెట్ల మధ్య ఉన్న కలుపును కొందరు మట్టుపెట్టగా మరికొందరు స్వచ్ఛ సుగంధాలు భరించలేని స్వచ్ఛ స్ఫూర్తికి దూరంగా జరిగే బాటసారులు డ్రైన్ అంచున పారవేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు పైకి లాగి డ్రైనేజి వరకు పరిశుభ్రం చేసే పనిలో నిమగ్నమవగా ఒక దళం ప్రత్యేకంగా రోడ్ల మీదకి రాబోయే చెట్ల కొమ్మలను యంత్రంతో కత్తిరించి చెట్ల యొక్క రూపాల్ని కూడ ఎంతో అందంగా ఉండేట్లు సరిచెయ్యడం స్వచ్ఛ సైనికులకే చెల్లు.

            దశాబ్దకాలం నాటి పని అనుభవంతో ప్రతి పనీ కూడా ఎంతో నైపుణ్యంతో నాణ్యతగా చెయ్యడం కొసమెరుపు. రోజు వారీ పని చేసే వ్యవసాయ కూలీల పనితనం కంటే ఈ గ్రామ సైనికులు చేసే పనితనం ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సంవత్సరాలుగా వదిలేసిన తాటిచెట్లు స్వచ్ఛ సైనికులు గీత కార్మికుల పనికంటే ధీటుగా పని చేసి తాటి చెట్లు అంత అందంగా గీసిన విధానం చూసే వారిని అబ్బుర పరుస్తుంది.

            అపరిశుభ్రతా, మురికి వీధులూ, అంటు రోగాల నిలయాలు మనకెందుకులే అనుకుంటే భావి తరాలకు శాపాలు అని గ్రహించని ఇంకొంతమంది జనం వీరి శ్రమను చూస్తూ వెళుతుంటే ఈ సమాజంపై జాలి వేస్తుంది. కాని ఎప్పటికైనా మార్పు అనివార్యమని అనుకొంటూ రేపటి తరాల కోసం స్వచ్ఛ సైనికులు పడుతున్న కఠోర శ్రమ ఎంతో వెలకట్టలేనిది.

            ఒంటిపూట బడులకు హాజరు కావాల్సిన ఉపాధ్యాయులు తక్కువ సమయమైనా ఎక్కువ శ్రమ చెయ్యాలని వారి తపన చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.

            ఏది ఏమైనా వేకువ 4:20 కి 9 మందితో మొదలైన స్వచ్ఛ సేవ 6:15 సమయానికి 33 మంది కార్యకర్తలతో పూర్తయి కాఫీల అనంతరం గురవయ్య మాస్టారి గంభీర స్వరంతో వినిపించిన జై స్వచ్ఛ చల్లపల్లి నినాదాలతో,

            డాక్టరు గారు రేపటి కార్యక్రమ ప్రదేశాన్ని చెప్పిన తరువాత నేటి కార్యక్రమం ముగిసింది.

గాంధీజీ బ్రతికుంటే మీ గడప కొచ్చేను –

ఘనమైన మీ పోరు చూసి గర్వించేను –

త్యాగమూర్తులు కన్న తల్లి

నువ్వే మా స్వచ్ఛ సుందర చల్లపల్లి.     

     ఇట్లు

నందేటి శ్రీనివాస్

ప్రజా కళాకారుడు

            మారిపోయే కర్మజీవికె

భిషగ్వరులో - కృషీవలురో - కేవలం గృహిణీమతల్లులొ

వణిక్కృముఖులొ - వృద్ధులో - ఉద్యోగులో ఎవరైనగానీ

పనిస్థలమున గంట సమయం స్వచ్ఛ పావన కార్యకర్తగ

మారిపోయే కర్మజీవికె మరీ మరీ అభివందనమ్ములు!

- నల్లూరి రామారావు

 

  02.04.2025.