3434* వ రోజు ........           05-Apr-2025

ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుదాం.

34  34* వ రహదారి శ్రమ సంబరం!

         అంటే-అది శనివారం(5.4.25) నాటిది; 4.19 కే -10 మంది స్వచ్ఛ వీరులతో ప్రారంభోత్సవం జరుపుకొన్నది, స్వచ్ఛ- సుందర కార్యకర్తలతో బాటు – పాగోలు సర్పంచీ, పంచాయితీ సెక్రటరీ గార్లు కలిసి, 40 మందిగా సంఖ్యా బలం పెంచుకోగలిగి, 6.05, ఆ తరువాత 6.25 దాక నెరవేరిన ఉత్సవమది!

         ఈ చల్లపల్లి – పాగోలు – కిలో మీటరు పైగా రోడ్డుకు 20 రోజులకు పైగా ప్రతి వేకువా 50-60-70 పని గంటల సపర్య లేమిటి?

         అదుగో- ఆ అడపా, పల్నాటి కార్యకర్తల తాడి చెట్ల సుందరీకరణకు మట్టలు నరికీ - నరికీ గూళ్ల, కండరాల నొప్పు లెందుకు?

         ఇంకాస్త – 20 గజాల పడమరగా - ముగ్గురు ప్రసాదుల, (దాసరి, ఆకుల, సజ్జా) ఇంకొందరి సహకారంతో గవిని వంటి మహా వృక్ష శాఖల ఖండన మండనా లేల? ఆటోరిక్షా కార్మికుడు నాగరాజు బట్టలు చెమటకు తడిసి పోయేంతగా రోజూ ప్రజల కోసం  శ్రమిస్తాడెందుకని?  

         ఇంత పెద్ద డాక్టరమ్మల, డాక్టరయ్యల -కర్షకుల - పంతుళ్ళ - విశ్రాంత వృద్ధ కార్యకర్తల-ముఖ్యంగా మహిళల -  నాలుగైదు లక్షల పనిగంటల శ్రమల పంతాలింకెంత కాలం ?

         బాటకు ఉత్తర దక్షిణాల డ్రైన్లలో- ఈ చీకటి వేళ 16-17 మంది గడ్డి చెక్కుడూ, చెత్త లాగుడూ, ప్లాస్టిక్ లేరుడూ, డిప్పలు మోయుడూ వంటివి వాళ్ళకు ఆనందం కలిగిస్తున్న దెందుకో!

         అసలింతకీ వీళ్ళంతా బొత్తిగా పిచ్చి పుల్లయ్యలో, వెర్రి వెంకమ్మ లో కాదుగదా! పోనీ - అలాగే జమకడదామంటే- నాలుగైదూళ్ల సర్పంచులూ, పంచాయితీ సెక్రటరీ, పొరుగు రాష్ట్రాల – విదేశీ నివాసుల ప్రమేయం ఉంటున్నదే - ఈ వీధి సేవల్లో!

         అప్పటి దాక చేసింది కష్టమే కాదన్నట్లూ, చెమటకు తమ వొంటి బట్టలు తడిసిపోనట్లూ చివరి సమావేశంలో  కార్యకర్తల ఉత్సాహం గమనించారా? ఒళ్ళు పులిసిపోయినా సరే – స్వచ్ఛ సుందరోద్యమ  నినాదాలను గట్టిగా ఆలపిస్తున్న గురవయ్య దీక్షను కనిపెట్టారా?

         ఇన్ని వేల రోజుల శ్రమ దీక్షను పరిశీలించాక – ఇందరి పరోపకార పరాయణతను అర్ధంచేసుకొన్నాక,  నేను గట్టిగా నమ్ముతున్న దేమంటే:

         “ఇంకో దశాబ్దమైనా సరే- ఈ సామూహిక - సామాజిక శ్రమదానాన్ని మానడం ఇక ఈ కార్యకర్తలకు చేత గాదనీ, డి.ఆర్.కె. గారి ఆరోగ్య ప్రదాయక, ఆనందదాయక హిత వచనాలు వినకుండ ఉండలేరనీ, తమ పరస్పర స్నేహ సౌరభాల్ని వదులుకోరనీ”!  

         రేపటి పెద్ద పండుగనూ, రహదారి శ్రమ వేడుకనూ ఇదే పాగోలు రోడ్డులోనే జరుపుకోవాలి!

        వందనములభివందనమ్ములు!

ఎవరు వీధుల నుద్ధరించిరొ - మురుగు కాల్వల లోతు చూసిరొ

హరిత సంపద వృద్ధి చేసిరొ - పూల బాటలు విస్తరించిరొ

ఉన్న ఊరిని స్వచ్ఛ సుందర చల్లపల్లిగ మార్చి వేసిరొ-  

ఆ మహోన్నత కార్యకర్తకె వందనములభివందనమ్ములు!

- నల్లూరి రామారావు

   05.04.2025.