ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?
ప్రతి ఒక్కరమూ సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుదాం.
7.4.25 – సోమవారమైనా 35 గురి రహదారి సేవలు! - @3436*
అవి బాధ్యతలో సేవలో గాని 4.19 కే వాటి ప్రారంభకులు 12 మందైతే – లేటుగా వెళ్లిన నాతో సహా – 6.10 కి ముగింపు పలికినది 35 గురు! ఆ బాధ్యతలు గ్రామ వీధుల్ని దాటుకొని, చల్లపల్లికి 3/4 కిలో మీటర్ల దూరాన పాగోలు సమీపాన - ఉత్తర దక్షిణ డ్రైన్లూ, రహదారి మార్జిన్లూ - మొత్తం మరొక 150 గజాలకు విస్తరించాయి!
ఆకాస్త జాగాలోనే పిచ్చి కంపల, ముళ్ళ పొదల, ప్లాస్టిక్ దరిద్రాల, వృక్ష సుందరీకరణల, బాట ఊడ్పుల, గడ్డి తొలగింపుల పనిలో 30 కి పైగా కార్యకర్తల శ్రమ సందడి!
తెలవారేకొద్దీ - ప్రొద్దు పొడిచే తరుణానికెందుకో గాని కొందరు కార్యకర్తల పని వేగం పెరుగుతుంటుంది! నలుగురైదుగురిలో పని ముగింపు విజిల్ మ్రోగే లోపు అప్పటికి పూర్తిగాని పనులు ముగించాలనే ఆత్రం పెరుగుతుంది! ఉదయభానుని నునువెచ్చని కిరణాలు చెమట ఒంటికి తాకి - ఒకాయన కూనిరాగాలందుకొంటాడు!
కోడూరు వీరుడి ఉత్సాహం కేకల రూపంలో వెలువడుతుంటుంది; నేటి పనికి సంతోషిస్తూనే “అయ్యో! ఊళ్లో ఉంటూ, రిటైరయ్యాక రెండేళ్లకు పైగా ఈ స్వచ్ఛ సేవలకు దూరంగా ఉండి పెద్ద తప్పు చేస్తినే” అని ఒక శంకర్రావు దిగులు పడుతుంటాడు! ఊరు కాని ఊరుకు 9 ఏళ్లలోనే 18 ఏళ్ల సేవలందించిన ఉదయ శంకరులు “ఈ కార్యకర్తలెంత ధన్యులో – తొలి రోజు నుండీ వారితోబాటు గ్రామ సేవలో పాల్గొనకపోతినే” అని చింతించడమూ చూశాను!
పాగోలు గ్రామ ప్రముఖుడూ, 2 కళాశాలల నిర్వాహకుడూ కుమారులతో సహా శ్రమించడమూ చూశాను! ‘ఆదివారం’ స్వచ్ఛంద సేవా నియమాన్ని గట్టున పెట్టి, ప్రతి రోజూ ఊరికి దూరంగా జరిగే రహదారి శుభ్రతకు వస్తున్న విన్నకోట వెంకటేశ్వరుడు ఈనాటి ఉద్యమ నినాదాల లెక్క సరిచేయడం మరో విశేషం!
ఐతే ఒక విషాదకర విశేషం వక్కలగడ్డ మణి ప్రభాకరుల అస్తమయానికి స్వచ్ఛ కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించవలసి రావడం! అతని 77 ఏళ్ల నిండు జీవితంలో సింహ భాగం సామాజిక అవసరాలకే అంకితం మరి!
Dr. డి.ఆర్.కె.గారి సమీక్షలో గత 8-9 ఏళ్ల పాగోలు రహదారి శుభ్ర-హరిత సుందరీకరణల పూర్వాపరాలు ప్రస్తావనకొచ్చాయి!
మరో 3-4 రోజులు మనం ప్రతి వేకువ కలుసుకోనేది పాగోలు సమీపంలోనే!
వందనములభివందనమ్ములు!
వారు - వీరను భేదమెంచక వార్డులన్నిటి బాగు చేసిన
బహిర్భూముల నాపివేసిన ‘ఫ్లెక్సి షేములు’ నిర్వహించిన
ప్రజాచేతన ప్రోది చేసిన - పాట పాడిన - ఆటలాడిన
స్వచ్ఛ సుందర ఉద్యమానికి వందనములభివందనమ్ములు!
- నల్లూరి రామారావు
07.04.2025.