ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
నేటిది (గురువారం – 10.04.2025) 3439* వ పనిదినం
పాగోలు సమీపాన సదరు మురికి పనులకు 2 గంటల పాటు పాల్పడ్డవారు వందో – రెండొందల మందో కారు – ఏదో సంసారపక్షంగా ఆ సంఖ్య 35! ఇంతకీ తమ ఊళ్ళకు దూరంగా వేళ కాని వేళ - ఈ స్వచ్చ కార్యకర్తలనబడే మురికి – తుక్కుల పని మంతులు 50-60 పని గంటల్లో దిగింది మురుక్కాల్వల్లో; ఏరింది ఎంగిలాకులూ, ప్లాస్టిక్ కప్పులూ, ఇతర ఏకమాత్ర ప్రయోజనకర వస్తువులూ; వాళ్ల చెమట ముఖాలకంటుకొన్నది దుమ్ము - ధూళీ!
మరి – ఇంతోటి అనాకర్షణీయ - అనాగరిక పనిమంతుల్నేమో నాబోటి గాళ్లు “ఆహా! ఓహో! స్వచ్చోద్యమ కారులు, శ్రమదానకర్తలు, ఊరికీ - నేటి సమాజానికీ ఆదర్శవంతులు..” ఆని కీర్తించడమొకటీ! నా వ్రాతలకు గ్రామ – గ్రామేతర - దేశ – విదేశీ అభిమానులు వాట్సప్ లో – ముఖపుస్తకంలో – ఇతరత్రా లైకులు కొట్టడాలూ!
‘పదీ - పదకొండేళ్ళుగా చల్లపల్లిలో క్రొత్త శ్రమదాన సంస్కృతి పుట్టి పెరుగుతున్నదని భావించే సామాజిక పరిశీలకులు కొందరు!
ఈ గురువాసర బ్రహ్మముహుర్తాన డజను మందితో ప్రారంభోత్సవం జరిగి, చివరికి 35 మందితో మినప చేలో ముగిసిన శ్రమదానోత్సవంలో - 5.12 - 6.10 నడుము గంట పాటు నా దృష్టికి వచ్చిన వింతలూ – విశేషాలు ఇవిగో!
1) 7 గురి బారు గడ కత్తుల - మిషన్ రంపాల మ్రోతల్తో బ్రహ్మం గారి గుడి దగ్గర బాగా ఎత్తైన వృక్ష – సుందరీకరణం,
2) అక్కడ ఆ 6 గురికి గతంలో చేసిన శుభ్రత చాల్లేదేమో మరి - మళ్లీ ఈ పూట గంటకు పైగా రోడ్డు మలుపు వద్ద శ్రమదానం,
3) ఇక - అసలు సందడంతా పాగోలు సమీపాన మిగిలిన 20 మందిదే! ఉత్తర దక్షిణాల డ్రైన్లలో పని సందర్భంగా కొన్ని చతురోక్తులు గాని, డిప్పల్తో తుక్కుల మోతలు గాని, వీధి ఊడ్పులు గాని, అసంకల్పిత కూనిరాగాలు గాని గడ్డి చెక్కుళ్లు గాని – అసలా గంటన్నరలో అదొక సామాజిక – సామూహిక – శ్రమ - వైభవం!
కాశీ యాత్రికుడు కావడంవల్ల అడపా వారికి నినాదాల అవకాశం వచ్చి - జీవితానికి పనికొచ్చే కొన్ని సూక్తులు కూడ వల్లించి – కోడూరు వారి 550/- విరాళాన్ని ‘మనకోసం మనం’ ట్రస్టీ గారు స్వీకరించి –
శుక్రవారం ఉదయం కూడ దివంగత రామబ్రహ్మం స్థలం వద్దనే కలవాలని నిర్ణయించి - నేటి కార్యక్రమం ముగింపు!
వందనాలు వందనాలు
తనది కాని లబ్దికొరకై దైనందిన శ్రమను చేసే,
శ్రమే కాక లక్షలల్లో సొంత సొమ్ము వెచ్చించే,
ఉద్యమాన్ని దీవించే ఉత్తమోత్తముల కెల్లను
వందనాలు వందనాలు అభినందన చందనాలు!
- నల్లూరి రామారావు
10.04.2025.