3440* వ రోజు .... ....           11-Apr-2025

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.

చల్లపల్లి, పరిసర రహదార్ల శుభ్ర సుందరీకరణలో – 3440* రోజులు!

         హూణశమైతే 2025 ఏప్రిల్ – 11 వ తేదీ, మన శకమైతే శోభకృతు నామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశీ శుక్రవారం!

         స్థలం - ప్రధానంగా మురుగు కాల్వలూ వగైరా! 100 గజాల వీధి శుచీ – శుభ్ర – సౌందర్య సాధకులైతే 30 మంది! తపః సమయమైతే బ్రహ్మకాల – 4:20 6:10 మధ్యస్తం!

         “నా విన్నవి కన్నవి విన్నవించగా – మాటలకై వెదుకాడగబోతే… అంటూ శ్రీశ్రీ  కవితా సాక్షాత్కారం గురించి ఆవేశపడ్డాడు! (మహాప్రస్థానంలో  “కవితా! ఓ కవితా!” - 1937)

         పదకొండేళ్లుగా ప్రతి వేకువా ఒకానొక గ్రామ సామాజిక ప్రయోగాన్ని వీక్షిస్తూ - పాల్గొంటున్న నా పరిస్థితీ అంతే! బైటి ప్రపంచానికి ఈ అపూర్వ శ్రమదానోద్యమ విశేషాలను వీలైనంత క్లుప్తంగా వ్రాయాలనుకొంటాను. ఒక్కోమారు కలం నా అదుపులో ఉండదు.

         ప్రతి ఒక్క శ్రమ వీరుడి కష్టాన్నీ పూసగ్రుచ్చినట్లు వివరించడమేమో కుదరదు, అతిశయోక్తులుండ కూడదు, అలాగని వేదంలో లాగా “సత్యం వద! ధర్మం చర!” (సత్యాన్నే పలుకు! ధర్మాన్ని ఆచరించు!” తరహాలో వ్రాయడమూ కుదరదాయె!

“అందుకని సూక్ష్మంలో మోక్షం లాగా నేటి సంగతులు :

- నెల నాళ్లుగా ఈ రహదారి సౌందర్యం కోసం శ్రమిస్తుంటే – ఎవరో రిక్షాలో ఎక్కడి తుక్కులో తెచ్చి బాగుచేసిన చోటపడేస్తే - కుక్కలు వాటిని చిమ్మితే - ఇద్దరు కార్యకర్తలు విసుక్కోక మళ్లీ శుభ్రపరచడం,

- ఉత్తరపు డ్రైనులో 2 చోట్ల తుక్కును కూడ అందంగా పేర్చిన 10 మందిలో ఒక అంజయ్య, ఒక లక్ష్మణుడు స్వచ్ఛ కామ్రేడ్స్ లాగా అలసిపోయి, వాళ్ళ నడుమ బండి శరత్ తూముల మీద విశ్రాంతి తీసుకోవడం,

- 30 మంది ధాటికి తట్టుకోలేక వీధి కాలుష్యాల పలాయనం,

- విజిల్ 2 మార్లు మ్రోగినా సుందరీకర్తలు 6.10 దాక పని ఆపకపోవడం,

- 6:25 కు మినప చేలో సభను సున్నితమైన నినాదాలతో లక్ష్మణ ప్రారంభించడం,

- తన వంతుగా స్వచ్ఛ వైద్యుడు కొంత స్వచ్ఛ సమాచారం వెల్లడించి, కార్యకర్తల కష్టాన్ని మెచ్చడం,

         శని - ఆదివారాల్లో మనం గంగులవారిపాలెంలో కలవాలని నిర్ణయించడం!

         వాదనలకే ఓటు వేద్దాం!

చదువులెందుకు - దైవ భక్తే చాలుననె ధూర్జటి కవీంద్రుడు!

సమాజ ఋణమును తీర్చుకొంటే చాలునని మన కార్యకర్తలు!

గడువు ముగిసిన వాదనలతో కన్న అనుభవ పూర్వకంగా

స్వచ్ఛ సుందర కార్యకర్తల వాదనలకే ఓటు వేద్దాం!

- నల్లూరి రామారావు

  11.04.2025.