ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
గంగులవారిపాలెం అంబేద్కర్ సాక్షిగా....@3441*
ఊరికి దూరంగా ఉన్నా, 60-70 ఇళ్లే ఉన్నా, అదీ చల్లపల్లిలో భాగమే! శనివారం (12.4.25) వేకువ నాల్గుంబావైనా కాకుండానే-15 మంది స్వచ్ఛ కార్యకర్తలక్కడ ప్రత్యక్షం! 5:00 కు ముందే చూస్తే-మరొక 38 మంది సాయుధులై ఆ నాలుగైదు వీధుల కాలుష్యం మీద కలబడుతున్నారు! 3-4-5 ఏళ్ల పసి వాళ్లు కూడ చోద్యం చూస్తున్నారు!
లోతుగా ఆలోచించని క్రొత్త వాళ్లకైతే “ఆ! ఏముందక్కడ-విగ్రహం చుట్టూ తళతళ మెరిసే క్రొత్త టైల్సూ, చుట్టూ పూల మొక్కల కోసం వదలిన శుభ్రమైన ఖాళీజాగా, సిమెంటు రోడ్లు చూడ చక్కగా...” అనిపిస్తుందేమోగాని-ఊరి వార్డుల్లోనూ నవ సంఖ్యాక రహదార్ల మీదా శుభ్రపరచి, చెట్లు పెంచి, ఊడ్చి, రాటుదేలిన చేతులకూ, స్వచ్ఛ-శుభ్ర సౌందర్య దృశ్యాల కలవాటుపడిన కార్యకర్తల కళ్ళకూ ఈ పల్లె అలా కన్పించదు మరి!
సిమెంటు బాటల అంచులెక్కడ విరిగిపడే అవకాశమున్నదీ, ఏ మురుగుకాల్వ నడక ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఆగినదీ, ఏ చెట్టు కొమ్మలు కనువిందుచేయనిదీ వాళ్ళ దృష్టిని తప్పించుకోలేవు!
అసలంత చిన్న పల్లె నుండి 20 మంది ఆడా-మగా కష్టజీవులు-మళ్లీ 7:00 కు వాళ్ళు కూలి పనులకెళ్లవలసి ఉన్నా-ఈ వేకువ శ్రమలో పాల్గొనడమూ-అందుకు సంతోషించడమే విశేషం!
ఈ 100 నిముషాల శ్రమదానంతో:
- ప్రధాన వీధే కాక 4 రోడ్ల దుమ్మూ-మురికీ వదిలించుకొనగా,
- అంబేద్కర్ సెంటర్ చుట్టూ ఏ చిన్న పుల్లా, పేపరు ముక్కా కనిపించనంతగా,
- ఊరి పడమర లోతైన డ్రైను పల్లెలోకి వచ్చే వెళ్లే వారికి శుభ్రతతో స్వాగతం పలకగా,
- ప్రార్ధనా స్తలాలూ, గొడ్ల పాకలూ పొందికగా కన్పించేంతగా,
- కొన్ని రోడ్ల మార్జిన్లకు బరంతులు సమకూడగా,
- పెద్ద బరువైన కాంక్రీటు గుంజల్ని ఐదారుగురు సర్దినపుడు వీధి విశాలంగా కన్పించగా..
ఐదున్నర లక్షల ఖర్చుతో సెంటర్ ను తీర్చిదిద్దిన - Dr.పద్మావతి దాని సొగసులకు మురిసిపోతుండగా..
స్థానిక యువకుడు బాలకృష్ణ స్వల్ప తడబాటుతో నినాదాలాలపించగా,
రేపటి పని చోటు కూడ గంగులవారిపాలెమేనని తీర్మానించగా-నేటి శ్రమ వేడుక ముగింపు!
వందనములభివందనమ్ములు!
వ్యసనమంటూ – వెర్రియంటూ వెక్కిరించే - కొక్కరించే
సాటి కొందరి శంకలకు తమ శ్రమతొ నిత్యం బదులు పలికే
గమ్యమునకై దశాబ్దంగా కలలు కంటూ కదం త్రొక్కే
స్వచ్ఛ సుందర కార్యకర్తకె వందనములభివందనమ్ములు!
- నల్లూరి రామారావు
12.04.2025.