ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
3442*వ తూరి కూడ గంగులవారిపాలెం వద్దే !
ఆదివారం (13-14-25) వేకువ సైతం మళ్లీ అదే చోట- అదే వేళ - 4.20 కల్లా ఆ 10 మంది కార్యకర్తలే - ఆగింది ఊరి వెలుపలే గాని, ఊరి లోపలా, పడమర దిశగా స్వచ్చ కార్యకలాపాలు. వీధి పారిశుద్ధ్య పని మంతులు 42 గా లెక్క కొచ్చినా- జాతీయ రహదారి- 216 దగ్గర తుది సభలో మాత్రం 39 మంది మిగిలారు.
ఈ 18 వ వార్డు మనుషుల ప్రత్యేకత గత 10 ఏళ్లుగా శ్రమదాన విషయంలో కనిపిస్తూనే ఉన్నది! స్వచ్చ కార్యకర్తలు కనీసంగా పాతిక ముప్పై మంది ఊరి ఏదొక మూల పని చేస్తూనే ఉంటారు గాని- ఈ వార్డులో స్పందనే వేరు! ఏదో- రావాలి కాబట్టి - లాంచనంగా, మ్రొక్కు బడిగా వచ్చి కాలక్షేపం చేసి - కబుర్లు చెప్పి వెళ్లే బాపతు కాదు- రెగ్యులర్ కార్యకర్తల్తో సమానంగానో, ఎక్కువగానో పనిచేస్తారు.
ఈ పూట శ్రమదాన స్వేద బిందువుల అదృష్టం పల్లె పడమర రోడ్డుదీ, దాని ప్రక్క పొలం గట్లదీ, మొత్తంగా 200 గజాల స్థలాలది! పొలంలోని 4 చెత్త గుట్టలూ. ఊర చెరువు ప్రక్క లోతైన డ్రైనూ, పెద్ద రహదారి దిశగా కొంత భాగమూ ఇప్పుడెలా ఉన్నవీ నిన్నెలా కనిపించాయి?
ఇందరి శ్రమను పీల్చుకొని దారి అంచుల గడ్డి తొలగి పోయి, 2 రకాల సీసాలు అదృశ్యమై, పిచ్చి మొక్కల జాడ లేక ఊరి లోని కొన్ని సిమెంటు బాటలకు బరంతు దక్కి, ఆ వంపు తిరిగిన రోడ్డు ఎంత అందంగా – ఎంత ఒయ్యారంగా- అదేదో ప్రాత సినిమా (ANR బంగారు బాబు) లో పాట- “దాని జిమ్మదియ్యా - అందమంతా కర్వ్ లోనె ఉన్నదీ...” అన్నట్లుగా మారిందా లేదా?
ఐతే చాల మంది అనుకొనేట్లు - ఈ కార్యకర్తలు కటిక నిస్వార్ధంగా ఈ శ్రమదానం చేయడం లేదు – ఇంట్లో పడుకొంటే ఈ పరస్పర మైత్రీ బంధాల్నీ, పరుల కోసం పాటుబడడంలో దక్కే అనిర్వచనీయ సంతృప్తుల్నీ వదులుకోలేక ఈ కఠిన శ్రమలకలవాటుపడ్డారు! మరీ ఆరేడుగురైతే నిత్య శంకితులు – పాపం “ పొరపాటున ఈ శ్రమదానం చెప్పా చెయ్యకుండా ఎప్పుడా గిపోతుందో ఏమో” అని వాళ్ళ దిగులు!
నేటి తుది సభను నినాదాలతో మొదలెట్టింది శ్రీహరి ; సమీక్షించింది Dr. దాసరి; వియత్నాం చాకెట్లు Dr. పద్మావతివి;
రేపటి అంబేత్కర్ జయంతికి పిలుపు గంగులవారిపాలేనిది;
సోమవారం వేకువ మన కలయిక కమ్యూనిస్టు వీధి చివర!
ఏసు గతికి ఉద్యమం?
విరామమే పొందకుండ - అలసటసలు తెలియకుండ
వీధి వీధి శోధిస్తూ మెరుగుదలను సాధిస్తూ
అంతంతగ సహకారము నందించే ఊరి కొరకు
ఎన్నాళ్లని మీ పయనం? ఏసుగతికి ఉద్యమం?
- నల్లూరి రామారావు
13.04.2025.