ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
ఇది 3443* వ సవినయ శ్రమదాన నివేదిక!
ముందుగా అనుకొన్నట్లుగానే-సోమవారం (15.4.25) వేకువ శ్రమ స్థలం బైపాస్ మార్గంలోని సామ్యవాద వీధికి మారింది-అదీ మరీ 4.15 కే-15 మంది గ్రామ బాధ్యుల్తో!
అందుక్కారణం-నాలుగేళ్ళ నాడు చల్లపల్లి మామ్మ అనబడే స్వర్ణలత గారు కాలం చేసిన రోజు గుర్తుగా దాసరి రామమోహనరావు గారు లక్ష రూకల భూరి విరాళ మీయవలసిన సందర్భం!
ఎక్కడైతేనేం-ఎప్పుడైతేనేం-నేటి కార్యకర్తల 25 సంఖ్యకు తగ్గకుండా ఈ సువిశాల గ్రామంలో ఏదోకమూల ఈ స్వచ్ఛ-సుందరోద్యమ శ్రమ కేతనం ఎగురుతూనే ఉంటుంది! పాతిక వేల గ్రామస్తుల్లో ఏ కొందరో వీధి గలీజు కారకులౌతూనే ఉంటారు-దానికిలా 11 ఏళ్ళైనా వాలంటీర్లు స్పందించకా మానరు!
“మరో రకంగా వ్రాయాలంటే-స్వచ్ఛ-శుభ్ర చైతన్యం చాలని కొందరు ఊరి వాళ్ళకూ-గ్రామ హరిత సౌందర్య లోలురైన కార్యకర్తలకూ నడుమ ఇది పదకొండేళ్ల జుగల్ బందీ!
అరే! ఇన్ని-30 వేల చెట్ల పెంపకాన్ని, తీర్చిదిద్దినట్లున్న వీధుల్ని, బాగుపడిన 3 శ్మశానాల్ని, బస్ ప్రాంగణాల్ని, పార్కుని, 4 చోట్ల స్వచ్ఛ-సుందర పబ్లిక్ టాయిలెట్లను చూస్తూ కూడ ఇంకా పాతిక-ముప్పై శాతం మనుషులు మారడం లేదంటేనే ఆశ్చర్యంగా ఉన్నది!
ఈ వేకువ శ్రమ సంగతుల్నే చూడండి-బైపాస్ వీధి బారునా-100 గజాలలో చెట్ల సుందరీకరణ, మినీ ఉద్యానాల్లో కలుపు తొలగింపు, నా స్థలంలో చూట్టానికి బాగాలేదని కొంత మేర బాగుచేత, 2 వీధి ఊడ్పులూ, వీటన్నిటి ఫలితంగా ట్రాక్టర్ నిండుగా వ్యర్ధాలూ కార్యకర్తల శ్రమకు సాక్ష్యాలే కదా!
ఎందుకోమరి-ఒకరిద్దరు తప్ప స్థానికులు నేటి శ్రమదానం జోలికి రాలేదు. అలా గంటన్నరకు పైగా సాగిన ప్రయత్నం 6.10 దాక నెరవేరి, అప్పటికీ ఇంకా ఐదారుగురు అయిష్టంగానే పని ముగించి,
దాసరి వారి ఇంటి గేటు వద్ద పాతిక మందీ+93 ఏళ్ల రామమోహనరావు గారి విరాళాన్ని నేనందుకుని, దాత తరపున వారి అల్లువాడు-జాస్తి వారు నినాదాలు ప్రకటించి, ఎప్పట్లాగే శ్రమ వేడుకను DRK గారు సమీక్షించి,
రేపటి వేకువ మళ్లీ మన పునర్దర్శనం పాగోలు గ్రామం వద్దనని నిర్ణయించి..... నేటి కార్యక్రమం ముగింపు!
అట్టివి ఆశించితిరా?
ఎవరైనా పిలిచితిరా-ఏ ముడుపులో ఇచ్చితిరా-
పదవులు కల్పించితిరా-బహు భంగుల పొగడితిరా-
తమ మనసుల తృప్తి కొరకు కేవల నిష్కామ కర్మ
లందించే-స్పందించే-తాత్వికులగు సాత్వికులగు
స్వచ్ఛ కార్యకర్తలసలు అట్టివి ఆశించితిరా?
- నల్లూరి రామారావు
14.04.2025.