3445* వ రోజు .... ....           16-Apr-2025

 ఒకసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వినియోగానికి మేము వ్యతిరేకం.

స్వచ్ఛ సుందర చల్లపల్లి 3445* వ రోజు శ్రమదాన విశేషాలు.

         ది. 16.04.2025 బుధవారం తెల్లవారు జామున 4:20 ని. పాగోలు రోడ్ లో 7 గురితో ప్రారంభమైన స్వచ్చ సేవా యజ్ఞం ఒక్కొక్కరుగా వచ్చి చేరికతో 24 మందితో పాగోలు రోడ్డు, దాని ప్రక్కనే ఉన్న డ్రైను అత్యంత సుందరంగా తయారయినవి.

         ఒక ప్రక్క మబ్బులు కమ్మిన వాతావరణంతో చల్లని గాలి, పండు వెన్నెలలో ఎంత శ్రమించినా ఒంటికి చెమట పట్టని కార్యకర్తల కష్టంతో కొంత భాగం ఇక్కడ నెయ్యి ఒలికినా తిరిగి తీసుకోవచ్చుఅనే పరిశుభ్రత మీద సామెత గుర్తుకొస్తుంది. కత్తులతో దారికి అటూ ఇటూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తూ డ్రైను అంచున విసిరేసిన ప్లాస్టిక్ ను అలాగే గాజు సీసాలను ఏరివేస్తూ ఒక గంటా నలభై నిముషాల పాటు గ్రామ శుభ్రత కోసం కష్టపడుతున్న కార్యకర్తలు ఈ చల్లపల్లికి ఉన్న గొప్ప ఆస్తి.

         రోజువారీ స్వచ్చ సేవలో జనమంతా పాల్గొనలేకపోయినప్పటికీ చల్లపల్లిలోని వీధులు చల్లపల్లికి నాల్గు దిక్కులా ఉన్న రహదారులూ ఇంత పరిశుభ్రంగా, పచ్చదనంతో నిండి ఉండడం స్వచ్ఛ కార్యకర్తల కష్టంతో మాత్రమేనని ప్రతి ఒక్కరూ ఒప్పుకొనే విషయమే.

         రెండు మూడు రోజుల పాటు శ్రమిస్తే పాగోలు రహదారిని అందంగా చూడగలమని ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్న కార్యకర్తలు ఈ ఊరి బాగుకై విరామ మెరుగక పరిశ్రమించే సైనికులు. 

         6 గం.లకు పని నిలుపుదలకు రధసారధి మ్రోగించిన సైరన్ తో ప్రతి ఒక్కరూ వారు చేసిన పనిని వెనుదిరిగి ఒక్కసారి చూసుకుని తమ ఇంటి వద్ద స్వంత పనిలాగ ముచ్చటపడి క్రొత్త స్ఫూర్తిని నింపుకొని,

         కాఫీ సేవించిన పిదప సమీక్షా కార్యక్రమంలో స్వచ్ఛ కార్యకర్తలను తన మనవరాలి పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించిన ముత్యాల లక్ష్మి గారు స్వచ్చ నినాదాలు పలికి స్వచ్చ చల్లపల్లికి 5,000/- రూ. విరాళం అందించారు, అలాగే చల్లపల్లి మెహర్ రైస్ మిల్లు యజమాని కుమారుడు తన తమ్ముడి వివాహ సందర్భంగా శనివారం నాటి రిసెప్షన్ కు రమ్మని జానీ గారితో కలిసి వచ్చి కార్యకర్తలకు ఆహ్వానం పలకడం జరిగింది.

         రేపటి కార్యక్రమాన్ని వివరిస్తూ కార్యకర్తలకు ఈ వారమంతా సహపంక్తి భోజనాలే అంటూ రధసారధి పలికిన ఛలోక్తితో అందరం నవ్వుకుని నిష్క్రమించడం జరిగింది.

         రేపటి మన శ్రమదాన ప్రదేశం కూడా పాగోలు రోడ్ లోని యార్లగడ్డ శివ ప్రసాదు గారి ఇంటి సమీపంలోనే..

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలతో చేయి కలిపి

సుందర చల్లని పల్లికి ఒకరికొకరు బుజం కలిపి

మానవాళి మనుగడకూ ఆధారం చెట్లుగా

నాటుదాము మొక్కలనూ నేల ఈని నట్లుగా

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు

         జయప్రదముగ ముగిసెనామరి!

రాజు కోసం శిరసులెన్నో రాలిపోయెను యుద్ధమందున

చాలచాలా ఉద్యమంబుల  చప్పచప్పగ ముగిసిపోయెను

చల్లపల్లిలొ స్వార్ధరహితులు సగటు మనుషులు జరిపినట్లుగ

శ్రమోద్యమ మింకెక్కడైనా జయప్రదముగ ముగిసెనామరి!

- నల్లూరి రామారావు

  15.04.2025.