ఒకసారి వాడే పారవేసే ప్లాస్టిక్ వినియోగం – మానవాళికి హానికరం సమాజంలో అందరికీ ఈ విషయంపై అవగాహన కలిపిద్దాం.
17.04.2025 గురువారం నాటి శ్రమైక జీవన సౌందర్యం-3447* వ రోజు
వేకువ జామున 4:17 ని.లకు 10 మంది కార్యకర్తల నిన్నటి రోజు పని నిలిపిన ప్రదేశం దగ్గర ఆగి రోడ్డు ప్రక్కనే ఉన్న ముళ్ళ పొదలు కలుపు మొక్కలు తొలగించారు. ఒకరు మాత్రం నిన్నటి పనిలో ఉన్న శేష భాగాన్ని సరిచేసుకుంటూ రావడం జరిగింది.
పెరిగి రోడ్డు మీదకి వస్తున్న సువర్ణ గన్నేరు, కాగితపు పూల చెట్లను కత్తిరించి అందంగా తయారుచేసే పనిలో ఇద్దరు కార్యకర్తలు నిమగ్నమవగా కత్తిరించిన కొమ్మలను ఈరోజు షెడ్దర్ లో వేయడానికి సౌకర్యంగా తొడుగు వేయువారు మరికొందరు. మహిళా కార్యకర్తలు మాత్రం సూక్షంగా ఉన్న కాగితపు మొక్కలు సైతం ఊడ్చి పోగు చేయడం ఎంతో నైపుణ్యమైన పని.
కార్యకర్తలు గడ్డి చెక్కే పని చూస్తే పూర్వం గ్రామాలలో పెద్ద పెద్ద ఆసాముల దగ్గర వారి గిడ్డీలలో పెళ్లి, పేరంటాకులు ఆ ప్రాంగణమంతా శుభ్రపరిచి ఎంతో నేర్పు కలిగిన పనివారు ప్రతి గ్రామంలో ఒకరిద్దరు ఉండేవారు. ఆ పనులకు వారిని మాత్రమే పిలిచేవారు. కానీ ఇప్పుడు స్వచ్చ కార్యకర్తలు చేస్తున్న పని వేరు రంగాలలో వేరు వృత్తుల వారైనప్పటికీ అత్యంత సుందరంగా ప్రదేశాలను తయారుచేయడంలో ప్రతి ఒక్కరిదీ అందె వేసిన చెయ్యి.
“పని పాటల సోదరులె పునాదులీ భువనానికి” అన్న సుద్దాల అశోక్ తేజ గీతానికి స్వచ్చ కార్యకర్తల శ్రమ సజీవ సాక్షంగా నిలిస్తుంది. నిన్న ప్రకటించిన ప్రకారం శ్రీ యార్లగడ్డ శివ ప్రసాదు గారు కార్యకర్తలకు ఈ రోజు అల్పాహారం ఏర్పాటు చేయగా 6 గం.లకల్లా పని ముగించుకొని వచ్చిన 31 మంది కార్యకర్తలూ సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాస్టర్ డేవిడ్ గారి వద్ద ప్రాక్టికల్స్ చేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన జూనియర్ పాస్టర్లు కూడా ఈరోజు సేవలో పాల్గొనడం విశేషం. దుర్గా ప్రసాదు మాస్టారు “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని నినదించగా రధసారధి Dr DRK గారు గత నెల జమా ఖర్చులు చదివి వినిపించారు. తదుపరి అందరూ కాలేజి కరస్పాండెంట్ శివ ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన అల్పాహారం అందుకొని నిష్క్రమించడం జరిగింది.
ఎవరెవరో వస్తారని ఎదురు చూస్తూ ఉందామా
మన ఊరిని మనమంతా బాగు చేసుకోలేమా
చెత్తా ప్లాస్టిక్ వ్యర్ధం రోడ్ల మీద విసిరేస్తే
ఈగలు దోమలమయమైఅంతా కాలుష్యమై
ముంచుకొస్తున్నాది అనారోగ్య గండం
ముందు కొచ్చి ఆపండి అందరికీ దండం.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
ఘర్మ జలములు ధర్మక్షేత్రం!
అహంకారం జాడ తెలియని – ఆభిజాత్యం లేని చోటిది
ప్రకృతి ఒడిలో నాగరికులే పరవశించు ప్రదేశమే ఇది!
పర్యావరణం బాగుపరిచే - ప్రశాంతంగా పనులు జరిగే
కర్మ వీరులు ఘర్మజలములు కార్చు ధర్మక్షేత్రమే ఇది!
- నల్లూరి రామారావు
17.04.2025.