ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు మానేసి – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
3449* వ నాటి శ్రమ పూరిత సంఘటనలు!
ఈ ఆదివారం నాటి వేకువ కూడ అవి పాగోలు సెంటరుకు సంబంధించినవే; పాగోలుతో సహా-విధిత గ్రామాలకు చెందిన 47 మంది శ్రమ; ఎవరికి నచ్చిన-ఎవరెంత వరకు చేయగలిగిన ఇష్టపూర్వకమైన మురికి పనుల కష్టాలన్న మాట!
ఎందుకిందరు పొరుగూళ్ళ నుండి వచ్చి, నెలరోజులు పైగా తమ రహదారిని తీర్చిదిద్దుతున్నారో కొంత వరకైనా సదరు గ్రామస్తుల మనసులకెక్కిన శ్రమదానాలన్నమాట! ఐతే-సెంటరులోని మురుగు కాల్వ వంతెన మీద కబుర్లాడుకొంటున్న కొందరు మాత్రం “తమ వీధుల్ని శుభ్రపరుస్తున్నదీ -డ్రైను వ్యర్ధాల్ని ప్రోగు చేసి, మోస్తున్నదీ, కూల్ డ్రింకుల-సారా సీసాల-ప్లాస్టిక్ వ్యర్ధాలను గోనె సంచులు నింపుతున్నదీ”, పొరుగూరి వైద్యులూ-గృహిణులూ, పెద్దలూ అని తెలిసినా చలించలేదనుకోండి!
మరి-ఆదివారమైనందున-దూరాభారమైనా పని స్థలానికొచ్చి, ఇందరు స్వచ్చ సంకల్పకులేం సాధించారు? అంటారా –
“తమ చల్లపల్లే కాక పరిసరాల రహదార్లూ, కొన్ని ఊళ్లూ పూర్తి నివాస యోగ్యాలుగా-పుష్ప హరిత సంభరితాలుగా-కాలుష్య రహితాలుగా మారి తీరాలి” అనే మంకు పట్టు పట్టి పదకొండేళ్లుగా స్వచ్చ-శుభ్ర సౌందర్యాల కొరకు సుదీర్ఘంగా ప్రస్ధానిస్తున్న కార్యకర్తలకు 2 గంటల పాటు ఎలా కష్టించాలో-ఉత్తరపు డ్రైను చెట్ల నెలా తొలగించాలో బాగా తెలుసు.
3-4 రోజుల్నాడే పూర్తికాదగిన పాగోలు గ్రామ శుభ్ర- సుందరీకరణ రేపటి క్కూడ ఎందుకు మిగిలిందనుకొంటున్నారు? వంతెన ప్రాంతమూ, 4 రోడ్ల NTR కూడలీ వాళ్ళకు నచ్చినట్లుండకపోవడం వల్లే!
44 గురు పాల్గొన్న తుది సమావేశాన్ని యోగా మాస్టరు తన నివాదాలతో మొదలెడితే-
మూడో నాలుగో స్వచ్యోద్యమ గీతాల తుంపుల్ని సందేటి శ్రీనివాసుడు ఆలపించి రక్తికట్టిస్తే-
గత నెల నాళ్ల కార్యకర్తల పట్టుదలనూ దాని ఫలితాలనూ DRK విశ్లేషిస్తే-
కొన్ని తర్జనభర్జనల పిదప రేపు కూడ అందరం పాగోలు సెంటరు కాలుష్యాల పనిపట్టాలని నిర్ణయించుకొని, ఇళ్లకు వెళ్లారు!
ఈ ఉదయం 11 గం॥కు చండ్ర వికాసకేంద్రం దగ్గర మణి ప్రభాకర సంస్మరణ సభకు వెళ్లాలని గుర్తుంచుకొన్నారు!
స్వాదుతత్త్వం మెరుస్తుందని
స్వాదుతత్త్వం మెరుస్తుందని- సాధు భావన జయిస్తుందని –
ఊరి కెంతో మేలుచేసే ఉద్యమం విలసిల్లుతుందని –
కనీసం ఒక గ్రామమైనా ఉదాహరణగ నిలుస్తుందని
ప్రయత్నించే కార్యకర్తల ప్రయాణానికి వందనమ్ములు!
- నల్లూరి రామారావు
20.04.2025.