ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు మానేసి – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
పాగోలు గ్రామంలో ముగిసిన సామాజిక శ్రమదానం @- 3450*
తేదీ ప్రకారం అది 21-4-25, వారమైతే సోమ, సమయమైతే-4:16 & 6:28 నడుమ, కృషి క్షేత్రం పాగోలు సెంటరు, అచ్చంగా కార్యకర్తలైతే 36 మంది అయ్యేవారు కారు – పాగోలు గ్రామీణులు 6 గురు కలవకపోతే!
నికర శ్రమ 60 కి పైగా పని గంటలు. ఏమేం పనులు, ఎక్కడెక్కడ ఎలా జరిగాయో చెప్పమంటే మాత్రం చప్పున చెప్పేవి కావు! 120 గజాల బారునా, NTR విగ్రహం దగ్గరా, మరీ ముఖ్యంగా ఉత్తరపు లోతు డ్రైనులో – అది కూడ కారణం తెలియదు గాని – ఘాటు కంపుల చోట – పాతిక మంది శ్రమనైతే చూసి తీరాల్సిందే!
అసలది పంట వ్యర్ధ జలం ప్రవహించే కాలువా లేక చెప్పరాని – వినరాని దిక్కుమాలిన ఇళ్ళ వ్యర్ధాల కేంద్రమా? కాలువల్ని, చెరువుల్ని, ఇళ్ల పరిసరాన్ని ఇన్ని రకాలుగా - ఇంత నిర్లక్ష్యంగా మనం తప్ప ఏదేశంలోనైనా వాడుకోగలరా?
పనికిమాలిన చెట్లూ, ఎండు కట్టెలూ, ప్లాస్టిక్ తుక్కులూ, జంతు అవశేషాలూ ఎన్నెన్ని దొరుకుతాయో - ఇలా శుభ్రపరిచే వాళ్లకు! డ్రైను ఉత్తరపు గట్టు నివాసులకైతే - అరగజం మందాన కాల్వలో వ్యర్ధాలు విసిరినందుకు ఎన్ని నమస్కారాలు చేయాలి!
చూసేవాళ్ళకేమో ‘ఈ కాస్త లెక్కే గదా ఇందరు బాగు చేసింది’ అనిపిస్తది. కాని అన్ని చెట్లను కోసి, ఎండు చిక్కు కొమ్మల్ని నరికి, త్రాళ్లతో ఒడ్డుకు చేర్చి, గుట్టలు పేర్చింది ఐదేసి వందల కూలి తీసుకొనే కార్మికులు కారే - మరో గంటలో పాఠశాలల డ్యూటీకి, ఆస్పత్రి పనులకీ, ఇతర వృత్తులకీ పోవలసిన కార్యకర్తలే!
ఐనా సరే – 2 రోజులు చేయదగ్గ పని ఈ ఒక్క రోజులోనే ముగిసింది. బట్టలు చెమటకు తడిసి, బురదంటుకొని విచిత్రంగా ముఖాలు మారిపోతే పోయినవి గాని – ఆ వదనాల్లో ఏదో మంచి పని సాధించిన సంతృప్తి! ఇలాంటి అసహ్యకర పారిశుద్ధ్య పనులకు మళ్లీ ఆ కార్యకర్తలు రేపటి వీధి పనుల సంసిద్ధత!
ఆ 34 గురి ప్రతినిధిగా గంధం బృందావనుడి గట్టిగట్టి నినాదాలు! అనితరసాధ్య పారిశుద్ధ్య కృషికి DRK గారి ప్రశంస!
రేపటి వేకువ పాగోలు సెంటరులో కాక – అదే రోడ్డులో NTR పాఠశాల వద్ద కలవాలనే ప్రతిపాదనకు అందరి ఆమోద ముద్ర!
నిన్నటి, నేటి రెండు సంఘటనలు :
శివరామపురానికి చెందిన మన సీనియర్ స్వచ్ఛ కార్యకర్త రావెళ్ల శివరామకృష్ణయ్య గారి కుమారుడు శ్రీ నాగ వరప్రసాదు గారు ‘మనకోసం మనం’ ట్రస్టు అకౌంటుకు 10,011/- బదిలీ చేసినందుకు స్వచ్ఛ కార్యకర్తల ధన్యవాదములు!
మరొక ముఖ్య సమాచారం! పాతిక మంది మహిళా సర్పంచులు చిత్తూరు జిల్లా నుండి “స్వచ్ఛ సుందర చల్లపల్లి” సందర్శనకు వచ్చి Dr. DRK గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను, వివరణలను ఆసక్తిగా గంట సేపు గమనించి, అభినందించి వెళ్ళుట.
అభివందనములు!
తెలియకుండ ఎన్నెన్నో రికార్డుల్ని తిరగరాసి,
పంచాయతి కెన్ని మార్లో ప్రశంసలను దక్కించి,
30-40 ఊళ్లకు మొదటి గురువులై నిలిచిన
చల్లపల్లి స్వచ్ఛ ఉద్యమానికి అభివందనములు!
- నల్లూరి రామారావు
21.04.2025.