3471* వ రోజు ....           12-May-2025

ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు!

గుడ్డ సంచుల వాడకమే ముద్దు!

సోమవారం - 12/5/2025 - 3471* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు!

          తెల్లవారుఝామున 4.17 ని.లకు 11 మందితో బస్టాండ్ సెంటర్ లో మొదటి ఫొటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ సమయానుగుణంగా 25 మంది చేరికతో వేగాన్ని పుంజుకుంది.

          స్వచ్ఛ దళ సభ్యులు యథాప్రకారం బాలికల హాస్టలు వద్ద గల రద్దును పల్లపు బాటలో సర్ధుటకు పయనమవుతూ కన్పించారు. వారు నిత్యం దీర్ఘకాలికంగా గ్రామానికి ఉపయోగపడే పనినే చేస్తారు.

          ఆకుల మరియు సజ్జా ప్రసాద్ గార్ల ద్వయం పెట్రోలు బంకు వద్ద అడ్డదిడ్డంగా ఉన్న పెద్ద బండరాళ్ళను సరిచేయటమే గాక ఊడ్వగా వచ్చిన రద్దును పల్లపు ప్రాంతాలలో సర్దే పనిలో లీనమైపోయారు.

          పెట్రోల్ బంకు వద్ద గల గార్డెన్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ నందేటి శ్రీనివాస్ బిజీగా కన్పించాడు.

          కోడూరు వారు, శంకర్ గారు, పోస్టల్ శ్రీనివాస్ లు బస్టాండు ఎదురుగా ఉన్నా తోట నరసయ్య నాయుడు పలక వద్ద అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని శ్రద్ధగా శుభ్రం చేస్తూ కన్పించారు.

          మెజారిటి సభ్యులు చీపుళ్ళకు పనిజెప్పి ప్రధాన రహదారిని అరగదీశారు అంటే అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా ‘క్లీన్ స్వీప్’ చేశారు.

          ఉదయం 5.30 ని.లకు కార్యకర్తలకు మంచి నీరు అందిస్తూ డాక్టర్ గోపాలకృష్ణయ్య గారు, కార్యకర్తల శ్రమను సెల్ ఫోన్ లో బంధిస్తూ శాస్త్రి గారు, ఈనాటి శ్రమకు విజయ సంకేతంగా ట్రాక్టర్ లో నుండి ఫోటోకు ఫోజిస్తూ అంజయ్య గారు, జరిగిన పనిని వెనక్కి తిరిగి చూసుకుంటూ కార్యకర్తల కష్టాన్ని ప్రతిరోజూ గుర్తుచేసుకునే Dr. DRK గారు.

          ఇవండీ! ఈనాటి స్వచ్ఛ కార్యక్రమ విశేషాలు.

          రేపటి శ్రమదాన వేదిక బస్టాండ్ సెంటర్ - చల్లపల్లి.

- భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

 

   12.05.2025.