3472* వ రోజు....           13-May-2025

 ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు!

గుడ్డ సంచుల వాడకమే ముద్దు!

మంగళవారం- 13-5-2015- 3472* వరోజు నాటి - స్వచ్ఛ శ్రమదాన విశేషాలు.

          తెల్లవారు ఝామున 4-17ని. కు బస్టాండులో 7 గురితో  మొదటి ఫోటోతో  ప్రారంభమయిన స్వచ్ఛ సేవ స్వేచ్చాయుత  వాతావరణంలో తదనుగుణంగా చేరిన 25 మంది స్వచ్ఛ సైనికుల  చీపుళ్ళ చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

          డాక్టరు గారి సూచనల మేరకు దుర్గాప్రసాద్, సజ్జా ప్రసాద్ గార్లతో పాటు నేను కూడా కలిసి బస్టాండులోని టాయిలెట్స్ ప్రక్కన గల పూల తోటను సుందరంగా మలచుటలో   కృతకృత్యులయ్యాము.

          10 సం॥ల నుండి స్వచ్చ సేవ చేస్తున్నారు గదా! చెత్త ఎక్కడుంటుంది? అంటారు కొందరు. కానీ ప్రతి రోజూ  చెత్తను దాస్తూనే ఉంటారు మరి కొందరు. మూల మూలన దాగిన అటువంటి చెత్తను వెలికి తీసి ట్రాక్టర్ లో వేసి శుభ్రం చేసి తృప్తి పడుతుంటారు మా కార్యకర్తలు.

          అన్నపూర్ణ, భాస్కర్, పోస్టల్ శ్రీను, సుభాషిణి, కోడూరు వారు, శంకర్, శివబాబు గార్లు నిర్విరామంగా గంటకు పైగా ఊడుస్తూ రోడ్డు పై దుమ్ము ధూళితో కూడిన చెత్తను ప్రోగులు పెట్టగా, ప్రత్యేక దళ – సభ్యులు  ఎప్పటి కప్పుడు లోడు చేసుకుంటున్నారు.  క్రమశిక్షణతో కూడిన శ్రమైక జీవన సౌందర్యం ఇదే కదా!

          ఉదయం 6గం॥కు పని సమాప్తం అయినట్లుగా విజిల్ వేయగా చెమటతో తడిసిన దుస్తులతో చేతులు శుభ్రం చేసుకుని కాఫీ సేవిస్తూ ఈరోజు జరిగిన పనిని తోటి వారికి వివరిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు సభ్యులు.

          యాక్స్ టైలర్ వెంకటేశ్వరరావు గారింటికి చీరాల నుండి చుట్టపు చూపుగా వచ్చిన వారి సోదరి పద్మావతి గారు స్వచ్చ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందదాయకం.

"నిన్న లేని అందమేదో..." అంటూ పృధ్వీశ్వర రావు గారు పాడిన మెలోడి సాంగ్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతూ కార్యకర్తలను ఆనందింపజేసింది.

          అడపా గురవయ్య గారు నినదించిన స్వచ్చ నినాదాలతో గొంతు కలిపి, చెప్పిన సూక్తులను విని సరదాగా ఛలోక్తులు విసురు కుంటూ రేపటి శ్రమ వేదిక - చల్లపల్లి బస్టాండ్ సెంటర్ అని తెలుసుకుని 6.30 ని. లకు స్వఛ్ఛ సైనికులు వెనుదిరిగారు.  

  భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

   13.05.2025.