3473* వ రోజు ....           14-May-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!

పర్యావరణ హితమే ముద్దు!

బుధవారం 14/5/2025 – 3473* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషములు.

          తెల్లవారుఝామున 4.15 ని॥కు 11 మందితో మొదటి. ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరి కొద్ది సమయానికే 30 మంది చేరికతో ఊపందుకొంది.

          వచ్చి రాగానే చేతికి గ్లవ్స్ ధరించి ఎవరికి నచ్చిన ఆయుధాన్ని వారు చేతబూని రధసారధి అనుజ్ఞ మేరకు జట్లుగా విడివడి చెత్తపై సమర శంఖాన్ని పూరించి యుద్ధానికి దిగారు మన స్వచ్ఛ సైనికులు. రణస్థలం బస్టాండ్ లోని పూల తోటలే మరి.

          వేసవి కాలపు ఉక్కపోతను లెక్కజేయక స్వేదాన్ని చిందిస్తూ అడపాదడపా మంచి నీరు సేవిస్తూ 6 గం॥ సమయానికి తమకు నిర్ధేసించిన పనిని శుభ్రతతో పాటు సుందరమయం చేశారు.

          విజయకృష్ణ పలికిన నినాదాలతో తమ గొంతు కలిపి, డాక్టరు గారు చెప్పిన వేసవికాలపు జాగ్రత్తలను ఆలకించి,

          రేపటి శ్రమవేదిక చల్లపల్లి బస్టాండులోనే అని తెలుసుకుని వంటికి పట్టిన చెమట మురికిని మురిపంగా చూసుకుంటు కదిలింది స్వచ్ఛ సైన్యం.

-  భోగాది వాసుదేవరావు

    సుందరీకరణ కార్యకర్త

    స్వచ్ఛ సుందర చల్లపల్లి

    14.05.2025.