సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!
పర్యావరణ హితమే ముద్దు!
గురువారం -15/05/2025 – 3474* వ రోజు నాటి ముచ్చట్లు.
తెల్లవారుఝామున 4:11 ని॥కు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన శ్రమదాన వేడుక మరికొద్ది సేపటికి మరొక 18 మంది కలయికతో బస్టాండులో గల పూదోటలో సందడి నెలకొంది.
డాక్టరు గారి సూచన మేరకు బస్టాండ్ ఎంట్రన్స్ కు కుడి వైపున గల గార్డెన్ లో SP గారు, JP గారు, యంగ్ టర్క్ DP, పోస్టల్ శ్రీనులు ఒక వైపు, శంకర్, చెక్ పోస్ట్ వారు, రామకృష్ణలు మరొక వైపు నుండి క్లీన్ చేసుకుంటు రాగా, ఎప్పటి చెత్తను అప్పుడు డిప్పలలో కెత్తగా, భాను ప్రకాష్, శివబాబు గారలు ట్రాక్టర్ లో లోడు చేస్తూ కన్పించారు.
బస్టాండులో గల మరొక గార్డెన్ నందు యోధానుయోధులు బృందావన్, నరసింహా, కస్తూరి, పసుపులేటి, నందేటి, లక్ష్మణరావు గార్లు మొక్కల మొదళ్లలో గల చెత్తను వేరుచేయగా సుభాషిణి మరియు హాస్పిటల్ స్టాఫ్ ఇద్దరు కలసి చీపుళ్ళతో ఊడ్చి ట్రాక్టర్లో లోడు చేయించారు.
అన్నపూర్ణ, భాస్కర్ దంపతులు చీపుళ్ళతో ఊడుస్తూ చెత్త చెదారాన్ని ప్రోగుపెట్టడం, ప్లాస్టిక్ వ్యర్ధాల్ని ఏరుతూ షణ్ముఖ శ్రీనివాస్ దర్శనమిచ్చారు.
పెదకళ్ళేపల్లి రోడ్ లో రోడ్డు ప్రక్కన గల చెట్లను అనుమతి లేకుండా నరికి నందుకు కలెక్టరేట్ లో గల స్పందనలో కార్యకర్తలు ఫిర్యాదు చేసి వారం కాక ముందే అదే రోడ్డులో మరొక చోట చెట్లను నరికి వేయడం జరిగింది - డాక్టర్ గారు జరిగిన సంఘటనను కార్యకర్తలకు చెప్పి ఆవేదన చెందారు.
పల్నాటి భాస్కర్ పలికిన స్వచ్ఛ నినాదాలతో తమ గొంతు కలిపి, రేపటి కార్యక్రమం కూడ చల్లపల్లి బస్టాండ్ లోనే అని తెలుసుకుని కార్యకర్తలు వెనుదిరిగారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
15.05.2025.