3475* వ రోజు ....           17-May-2025

భూమిలో ఎప్పటికీ కరగని ఫ్లెక్సీలు వాడనే వద్దు!

భూమిలో కలిసిపోయే గుడ్డ బ్యానర్ల వాడకమే ముద్దు!

శనివారం – 17/5/2025 – 3475* వ రోజు

          తెల్లవారు ఝామున 4.15 ని.లకు 11 మందితో 11 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన శ్రమదాన వేడుక మరికొద్ది సేపటికే 18 మంది చేరికతో ఊపందుకొంది.

          చల్లపల్లి బస్టాండులో గల 5 గార్డెన్ లలో మూడు గార్డెన్స్ శుభ్రతతో సుందరమయంగా అలరారుతున్నాయి మిగిలిన రెండు గార్డెన్స్ లలో కార్యకర్తలు పనికి ఉపక్రమించారు.

          బస్టాండ్ ఎంట్రన్స్ కు కుడి ప్రక్కన గల గార్డెన్ నందు గల ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుతూ, నానా రకముల చెత్త చెదారాన్ని ప్రోగు పెడుతూ డా.పద్మావతి మేడమ్, దుర్గా ప్రసాద్ లు పనిలో లీనమైయుండగా, రమేష్, విన్నకోట వెంకటేశ్వరరావు, మల్లీశ్వరిలు చెత్తను డిప్పలకెత్తి ట్రాక్టర్ నందు లోడ్ చేస్తూ కనిపించారు.

          మరొక గార్డెన్ నందు బృందావన్, నరసింహ, అంజయ్య, కస్తూరి సోదరులు శుభ్రపరచగా ఏర్పడిన చెత్తను చీపుళ్ళతో ఊడ్చి డిప్పలకెత్తి లోడు చేస్తూ హాస్పిటల్ స్టాఫ్ కృష్ణకుమారి, నాగలక్ష్మిలు బిజీగా కన్పించారు.

          మరొక చోట ముళ్ల కంపను కొడుతూ సజ్జా ప్రసాద్ గారు ఆ చెత్తను లాగుతూ సుభాషిణి దర్శనమిచ్చారు.

          బస్టాండులో పాడుబడిన టాయిలెట్స్ వద్ద జంగిల్ క్లియరెన్స్ చేసి “నన్ను చూడు, నా అందం చూడు” అన్నట్లుగా ఆ ప్రాంతాన్ని సుందరమయం చేస్తూ చెక్ పోస్ట్ వెంకటేశ్వరరావు, శంకర్ గార్లతో పాటు వేముల శ్రీనివాస్, భానుప్రకాష్ లు కన్పించారు.

          బస్టాండ్ ఎంట్రన్స్ వద్ద చీపుళ్ళతో శుభ్రం చేస్తూ అన్నపూర్ణ, భాస్కర్ లతో పాటు తన సెటైర్ లతో సందడి చేస్తూ BDR దర్శనం ఈనాటి విశేషం.

          కార్యకర్తల శ్రమ ఫలితమే ఈ శుభ్రతా సౌందర్యం అంటూ ప్రతి కార్యకర్త శ్రమను సెల్ ఫోన్ లో చిత్రిస్తూ శాస్త్రి గారు, అందరికి మంచి నీరు అందిస్తూ ఆనందరావు, డా. గోపాలకృష్ణయ్యలు, శ్రమించిన కార్యకర్త కోరిన విధంగా కాఫీను అందిస్తూ నందేటి శ్రీనివాసులు తమ తమ పనుల్లో లీనమయ్యారు.

          స్వచ్ఛ నినాదాలు పలకటంలో BDR తో తమ గొంతు కలిపి, చెట్లు నరకడం విషయమై MLA బుద్ధ ప్రసాద్ గారు ఆగ్రహించిన వైనం గూర్చి Dr.DRK గారి మాటల్లో విని,

          రేపటి శ్రమదాన వేదిక చల్లపల్లి బస్టాండులోనే అని తెలుసుకుని నేటికి కార్యకర్తలు వెనుదిరిగారు.

భోగాది వాసుదేవరావు

    సుందరీకరణ కార్యకర్త

    స్వచ్ఛ సుందర చల్లపల్లి

    17.05.2025.