3476* వ రోజు ....           18-May-2025

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు మేము దూరం

కాలుష్యం లేని సమాజమే అందరికీ ఆధారం!

ది. 18.05.2025 - ఆదివారం – 3476 వ రోజు స్వచ్చంద శ్రమజీవన విశేషాలు.

          వేకువ జామున 4.19 ని.లకు బస్టాండు ప్రాంగణంలో 10 మంది కార్యకర్తలతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవలు కొద్ది సేపట్లో ఒక్కొక్కరుగా చేరికతో 35 మందితో బస్టాండు వెనుక భాగాన్ని కార్యకర్తలు చూడచక్కగా తయారుచేశారు.

          రధసారధుల వారు నిన్నటి కార్యక్రమంలో నిర్దేశించిన పనిని పూర్తి చేయడంతో పాటు మరికొంత ప్రదేశాన్ని కూడా శుభ్రం చేశారు. బస్టాండులోని బైక్ స్టాండుకు కూడా స్వచ్ఛ కార్యకర్తల స్వేదంతో మోక్షం లభించింది.

          నిన్నటి భాగంలో మిగిలిన కొద్ది పనిని కోడూరు వారు, శంకర్రావు బృందం పూర్తి చేయగా మరికొంతమంది రేపటి పనికి కొనసాగింపుగా మెయిన్ రోడ్ లోని కొంత భాగం శుభ్రపరచి, చెమటలతో తడిసి ముద్దయినా గ్రామ సేవకై మొక్కవోని దీక్షతో పనిపాటల సోదరులె పునాదులు ఈ భువనానికి అన్నట్లుగా శ్రమించి 6 గం.లకు పని విరామంతో కొద్ది నిమిషాలు కాఫీ కబుర్లతో గడిపారు.

          అనంతర సమీక్షలో గ్రామ సర్పంచ్ కృష్ణకుమారి గారు జై స్వచ్ఛ చల్లపల్లి నినాదంతో పాటు ఈ నెల 23 రాత్రి జరగనున్న వారి కుమార్తె వివాహ వేడుకకు కార్యకర్తలందరూ తప్పనిసరిగా హాజరవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేయడమైనది.

          రేపటి కార్యక్రమానికి బస్టాండు వెలుపల ఆటో స్టాండు వద్ద కలుద్దామని అనుకుని నిష్క్రమించిరి.

 

వేకువనె నిద్ర లేచి ఊరికి పనిచేయడం – చెత్తా ప్లాస్టిక్ వ్యర్ధం ఏరిపారేయడం

మంచి మొక్క మధ్య చెడ్డ కలుపును ఏరేయడం – మురుగు కాల్వకడ్డు తీసి ముందుకు నడిపించడం –

చెట్టును ప్రేమించడం

చెమటను ప్రేమించడం-

మట్టిని ప్రేమించడం

మనిషిని ప్రేమించడం

మీ సహజ గుణమయ్యి వర్ధిల్లుతుంది.

నందేటి శ్రీనివాస్

    ప్రజాకళాకారుడు

    18.05.2025.

 

         సంతోషము - ఆశ్చర్యము!

“ఈ శ్రమ వేడుకె లేకుంటే చచ్చేవాణ్ణి ఏనాడో”

“రెండ్రోజులు మానేస్తే పిచ్చెక్కును మరునాటికి

ఎలా మానగలం ఇంక శ్రమదానం వ్యసనాన్ని అని

శ్రమదాతలు చెపుతుంటే సంతోషము-ఆశ్చర్యము!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

 

  18.05.2025.