3479* వ రోజు ....           24-May-2025

 ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వాడకం హానికరం

పర్యావరణం కలుషితమైతే మన మనుగడ ప్రమాదకరం

ది. 24.05.2025 శనివారం 3479 వ రోజు నాటి స్వచ్ఛ సేవల వృత్తాంతము.

         వేకువ జాము 4:15 కు 10 మందితో బాలికల హాస్టల్ ప్రాంగణం వద్ద మొదలైన స్వచ్ఛతా కార్యక్రమం రసవత్తరంగా సాగుతుండగా 4:40 నిమిషాలకు వర్షం వలన అంతరాయం ఏర్పడింది. అప్పటివరకూ కొంత మంది దారికీ రెండు ప్రక్కలా గడ్డిని బాగుచేస్తుండగా కొద్దిమంది ఇటుకరాయి, సిమెంటు రద్దుతో రోడ్డు మలుపులో కోతకు గురైన భాగాన్ని బండరాళ్ళ రివిట్ మెంట్ తో కొంత మెరుగుపరిచారు.

         ఒకరు గార్డెన్ లో శుభ్రం చేయగా కొందరు మహిళా కార్యకర్తలు రోడ్డును చీపుళ్ళతో శుభ్రపరిచారు. అకస్మాత్తుగా వచ్చిన వర్షంతో కొంత విరామం తరువాత తడిసి ముద్దయిన సైనికులు కొన్ని చిన్న తురాయి (గద్ద గోరు) మొక్కలను రోడ్డు ప్రక్క నాటడం జరిగింది.

         చలి కమ్మిన కార్యకర్తలకు స్వచ్ఛ కాఫీతో కొంత వేడి వాతావరణం అందించినట్లయింది.

         వర్షానికి మైకు తడుస్తుందని మైకు లేకుండా కూడా అందరికీ వినిపించే కోడూరు వారి కంచు కంఠంతో జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదం మార్మోగగా రేపటి వేకువ కలవవలసిన ప్రదేశం ఇక్కడే అని నిర్ధారించుకుని నిష్క్రమించారు.

కొసమెరుపు :

      ఇంతకూ వస్తూ వస్తూ ఇంత పెద్ద వర్షాన్ని వెంటబెట్టుకొచ్చినది వేకువనే నిద్ర లేచి వచ్చిన కస్తూరి విజయ్ గారా! ఈరోజు కొత్తగా వచ్చిన డ్రైవర్ ఆనందరావు మనవరాలు చి. హరికా నా! ఎవరికీ అర్ధం కాలేదంటూ ఛలోక్తిగా అనుకుని నవ్వుకున్నారు.                  

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు  

   24.05.2025.

        

         శ్రమను ఎట్టుల చూడవలెనో!

కలుషములపై అలుపెరుంగని కార్యకర్తల సమరమేమో -

బాధ్యతెరుగని సమాజానికి పాఠములు నేర్పించుటేమో -

స్వార్ధ పూరిత సమాజంపై త్యాగమను దివ్యాస్త్రమేమో -

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమను ఎట్టుల చూడవలెనో!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

   24.05.2025.