3482* వ రోజు ....           27-May-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!

పర్యావరణ హితమే ముద్దు!

27-5-2025 - మంగళవారం – 3482* వ రోజు.

         శ్రమదాన వేడుక :- హైవేలో కాసానగర్ సెంటర్.

         “యువరక్తం ఉప్పొంగింది - ఫినిషింగ్ టచ్ అదిరింది” అంటూ ఇవాళ  డా. DRK గారు తుది సమీక్షలో సంబరపడిన వేళ, చిన్నారుల పనితనాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న వేళ మా కార్యకర్తలకు చేతి నిండా పని ఉంటే ఉత్సాహం, లేకుంటే నిరుత్సాహం అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఈరోజు సమయం సరిపోలేదు, కాసేపాగి ‘విజిల్’ వేస్తే బాగుండు అనుకుంటూ 40 మంది కార్యకర్తలు, చేసిన పనికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ కదం తొక్కిన వేళ, ఇవాళ.

         వేకువ ఝామున 4.19 ని.కు 15 మందితో ప్రారంభమయి క్రమేణ 40 మంది సందడితో పండుగ వాతావరణం నెలకొంది. పలుగు, పార, గొర్రు, కత్తి, చీపురు ఎవరికి కావలసిన పనిముట్లు వారు అందుకుని ఎవరి పనిని వారు సరదాగా, ఇష్టంగా, క్రమశిక్షణతో  చేసుకుపోవడం హైవే పై వెళ్ళే చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగించింది అనుట అతిశయోక్తి కాదేమో!

         కాసానగర్ సెంటర్ కు పడమర వైపు గల డివైడర్ లో మట్టిలో కూరుకుపోయిన బండ రాళ్ళను పలుగుతో పెకలించి మోసుకునిపోయి రహదారి ప్రక్కన సర్ధుతూ కొంతమంది, పారతో చెక్కుతూ, చెత్తను వేరుచేసి డిప్పలకెత్తి ట్రాక్టర్ నందు లోడ్ చేస్తూ మరికొందరు, డివైడర్ ప్రక్కన గల చెత్తను ఊడుస్తూ, దుమ్ము ధూళిని పోగుచేసి డివైడర్ లో గల పల్లపు ప్రాంతంలో వేస్తూ కొందరు, హైవేకి ఇరుప్రక్కల గల ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ సీనియర్ కార్యకర్తలు మరియు యువ కార్యకర్తలు దర్శనమిచ్చారు.

         6:19 వరకు ఈ స్వచ్ఛ సేవ కొనసాగింది. ఒక అజ్ఞాత దాత ఉద్యమ ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయల విరాళాన్ని అందించినందులకు ధన్యవాదములు తెలిపి, వేల్పూరి ప్రసాద్ పలికిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి,

         రేపటి శ్రమదాన వేడుక కాసానగర్ ప్రాంతమే అని తెలుసుకొని స్వచ్ఛ కార్యకర్తలు వెనుదిరిగారు.

- భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

   27.05.2025.

 

         ఒక్క మాటలో

ఉమ్మడి సౌఖ్యం కోసమె ఉఛ్వాసం నిశ్వాసం

ఊరి మేలు నిమిత్తమే స్వచ్చోద్యమ విన్యాసం

ఎందరెన్ని అనుకొన్నా వెనకడుగేయని తత్త్వం

ఒక్క మాటలో చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమదానం!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

   27.05.2025.