ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం!
27.06.2025 శుక్రవారం 3512* వ రోజు శ్రమైక జీవన సౌందర్యం!
216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:15 నిమిషాలకు 15 మంది కార్యకర్తలతో ఈరోజు గ్రామ సేవలు ఉత్సాహంగా ప్రారంభమయినవి.
దారి ప్రక్క పూలమొక్కలు, దారికి దిగువన నీడ నిచ్చు పూలు తప్ప ఎలాంటి పిచ్చి మోక్కలూ, కలుపు మొక్కలూ వాటి పెరుగుదలకు ఆటంకం కాకుండా కార్యకర్తలు శుభ్రం చేశారు. పెద్ద మొక్కలకు వర్షాకాలం నీరు నిలిచి ఉరక తగలకుండా డిప్పలతో మట్టిని తెచ్చి మొదళ్ళలో వేసి వాటిని సంరక్షిస్తున్న తీరు చూస్తుంటే “చెయ్యి తిరిగిన పనివారంటె స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలే” అన్నట్లుంది.
ముగ్గురు కార్యకర్తలు దూరంగా బోదె గట్టుపై శుభ్రం చేసి ఎప్పుడో నాటిన నీడనిచ్చు మొక్కలను సరిచేసి వాటి చుట్టూ బాగుచెయ్యడం జరిగింది. కొంత భాగాన్ని శుభ్రంగా ఒక కార్యకర్త మిషన్ తో కట్ చేయడం స్వాగత ద్వారం వరకూ రోడ్డు ప్రక్కన దాదాపు పూర్తి అయినది. రోడ్డుకు దిగువ భాగంలో బోదె గట్టు పొడవునా మాత్రం కొంత పని మిగిలి ఉంది.
హైవే రోడ్ నుండి చల్లపల్లి వచ్చే వారికి ఇదే మా స్వాగత సుమాంజలి అంటూ ఎరుపు - పసుపు రంగు పూల సోయగాలతో చేతులు చాస్తున్నట్లు కనువిందు చేస్తున్న అడవి తంగేడు (గద్దగోరు) చెట్ల పూల అందాలు వర్ణింపతరమా అన్నట్లుంది. మురుగు కాల్వ గట్టు పై 3 సంవత్సరాల క్రితం అనేక శ్రమల కోర్చి కాల్వ గట్టున ఉన్న పురుడు కంప, ముళ్ళ పొదలను నిర్మూలించి కాల్వ గట్టు పొడవునా కార్యకర్తలు నాటి, మండు వేసవిలో ట్రస్టు కార్మికులు వాటికి నీరు పోసి పెంచిన ఎర్ర తురాయి మొక్కలు నేడు అటుగా వెళ్ళే పోయే ప్రయాణికులకు అదొక ఎర్ర పూలవనం లాగ ‘నా అందం చూడు బావయ్యో’ అన్నట్లు ఎర్ర తురాయి వైభవం భలే చూడ చక్కగా ఉంది.
డాక్టరు గారు మాట్లాడిన ప్రతిసారీ “ప్రతిదీ శ్రమ నుండే ఉద్భవిస్తుంది” అన్నట్లు పది సంవత్సరాల పైబడి లక్షల గంటల కార్యకర్తల అలుపెరుగని శ్రమ నుండే అనేక మందికి ఈ చల్లపల్లి నలు దిక్కులా అందాన్నీ, ఆహ్లాదాన్నీ పంచుతున్నాయి.
కొద్ది మంది కార్యకర్తలు స్వాగత ద్వారం వైపు మొక్కలలో కూడ కొంత పని ఈ రోజు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ సమయంలో అంతమంది మనుషులు మధ్య అంత ఉత్సాహంగా నూతనోత్తేజంతో గ్రామం కోసం పని చేసే వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అదే ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ఉద్యమం.
6 గంటల సమయానికి విజిల్ మ్రోగగానే అందరూ పనికి విరామమిచ్చి కాఫీ కబుర్లతో ఒంటి చెమటను ఆరనిచ్చి తదుపరి సమీక్షా సమావేశంలో డా.హేమ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి జై కొట్టడం జరిగింది.
పేటేరు నుండి ఈ రోజు సేవలో పాల్గొన్న డా.హేమ మేడం గారి తల్లి దండ్రులు అత్యంత ఉత్సాహంగా పని చెయ్యడంతో పాటు ‘రామమోహనరావు’ గారు (హేమ గారి నాన్న) సత్య హరిశ్చంద్ర నాటకంలోని రెండు పద్యాలు ఎంతో రాగ యుక్తంగా పాడుతుండగా ‘మహాలక్ష్మి’ ఈలలు, వన్స్ మోర్ లతో సమీక్షా సమావేశం కాస్త రంగస్థలంగా మారినట్లయింది.
రేపు ఉదయం 11 గంటలకు జరిగే దేసు మాధురి గారి ఆహ్వాన పత్రిక చదివి వినిపించి,
రేపు మనం కలువవలసిన ప్రదేశం కూడ స్వాగత ద్వారం వద్దనే అనుకొని ముగించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
27.06.2025
ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 9
మానవుడే మహనీయుడు – మనిషి శ్రమే మహోత్తమం
సమాజ పరమగు శ్రమకిదెనా సాష్టాంగ నమస్కారం
“ఊరి కొరకు ప్రతినిత్యం ఉద్యమించు ధీరులే
ఆదర్శులు – మహోన్నతులు” అనుట నిర్వివాదాంశం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
27.06.2025