ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 2002* వ నాటికి చేరిన బాధ్యతా నిర్వహణ
ఈ నాటి వేకువ సమయంలో 4.10 నిముషాల నుండి 6.10 దాక వర్ధిల్లిన స్వచ్చ కార్యకర్తల శ్రమదాన సందేశంలో 29 మంది పాల్గొన్నారు. ప్రదేశం – ఎంత చేస్తున్నా తరగని చెత్తా – చెదారం నిండిన గంగులవారిపాలెం మార్గంతో పాటు, బందరు రహదారిలోని అమరావతి జమిందారుల “వైజయంతం”.
రెండు వారాల నుండి అంగుళాల లెక్కన శుభ్రపరచి, సుందరీకరిస్తున్న గంగులవారిపాలెం తారు రోడ్డును, దారి ప్రక్కల ఏనాడో తామే నాటి, సంరక్షించగా విరగబూసిన బోగన్ విలియా రంగు పూల మొక్కల పాదుల్నీ, రైతులు, ఎడ్ల బళ్ళతో ఇళ్ళకో – చావిళ్ల దగ్గరకో చేరుస్తుండగా చెట్లకంటిన, రాలిన ఎండు గడ్డి పరకల్నీ, ప్లాస్టిక్ సంచుల్నీ, ఖాళీ మద్యం సీసాలను ఊడ్చి, ఏరి, సరిదిద్ది, స్వచ్చతా పాఠాలు బోధించి, కొందరు వంచిన నడుములెత్తితే – మరికొన్ని తాడి చెట్ల చిక్కు ఆకులు నరికి నలుగురు వాటి అందాలకు మెరుగులు దిద్దారు.
నిన్న - ఈ రోజు రెస్క్యూ దళం వారి కృషి కాస్త నెమ్మదించింది. చెట్ల మూలాలకు, తారు రోడ్డుకు రక్షణ కల్పించాలనే వీళ్ళ ఉద్దేశం మంద కొడిగా నెరవేరడానికి కారణం – బండ్రేవు కోడు మురుగు కాల్వ ఉత్తరపు అంచు నిలువుగా ఉండి, మట్టిని త్రవ్వడానికి, పైకి చేర్చడానికి అనువుగా లేకపోవడమే.
గత సుందరీకరణ కృషికి మరిన్ని కొత్త మెరుగులు దిద్దుతూ, ఆరేడుగురు బందరు రహదారి మీది వైజయంత కుఢ్య చిత్రాల మీద మరొకసారి దృష్టి పెట్టారు.
ఎండ ఉక్కలూ, చలి మంచులూ, ముసురు వానలూ సరే – కరోనా ప్రమాదాలలోనైనా స్వచ్చ కార్యకర్తల గ్రామ బాధ్యతలు ఆగలేదు. సారా కొట్ల – పళ్ల కూరల అంగళ్ళ దగ్గర కొందరి వలె కాక, మూతులకు చిక్కాలు కట్టి, ఐదారడుగుల దూరం నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ తమ సామాజిక కర్తవ్యాలు నెరవేర్చుకొంటున్న ఈ ధన్యులకు జేజేలు!
రేపటి మన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ కృషి సైతం - గంగులవారిపాలెం దారి, వైజయంతం ప్రాంతాలలోనే అని గమనార్హం!
ఒక ఉమ్మడి శ్రేయస్సుకు
స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బేదనగా...
సామాజిక ఋణ విముక్తి సాధనమొక తాత్త్వికతగ –
“నా కోసం నేను కాదు – మనకోసం మన” మనకొని
ఊరుమ్మడి శ్రేయస్సుకు ఉరకలెత్తి సాగడం!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
మంగళవారం – 05/05/2020,
చల్లపల్లి.