పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
01.08.2025 శుక్రవారం - 3547* వ రోజు నాటి గ్రామ సేవలు!
తెల్లవారుజాము 4:16 నిమిషాలకు గంగులవారిపాలెం రహదారి మలుపులో 9 మంది కార్యకర్తలు పని ప్రాంభించారు. ఆదారి ప్రక్కన కార్యకర్తలు గతంలో నాటిన మొక్కలు, గద్దగోరు, పొగడ, సువర్ణ గన్నేరు మొక్కలకు బాగా పిచ్చికాడ అల్లుకుని ఊపిరాడకుండా కమ్మేసింది. ఆ పిచ్చి తీగ లాగి మొక్కలకు స్వేచ్చా వాయువులు ప్రసాదించే పనిలో కార్యకర్తలు తలమునకలయినారు. మిషన్ తో గద్దగోరు మొక్కలను ఒక ఎత్తుకు కత్తిరించుకొంటూ ఖాళీ చేసుకుంటూ మిగతా మొక్కలను బయటకు తీశారు.
ఆ కొద్ది దూరం బాగు చేయగా వచ్చిన టన్నులకొద్దీ కొమ్మలను బండ్రేవుకోడు మురుగు కాలువకు రోడ్డు దిగువ భాగాన ఆ మలుపు భాగం అంతా పెద్దగా రక్షణ గోడలాగ కట్టి కార్యకర్తలు పనిలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అది చూస్తే డ్రైనుకు రోడ్డుకు మధ్య పాకిస్తాన్ సరిహద్దు గోడలాగ అనిపించింది. మరికొంతమంది కార్యకర్తలు దారికి రెండవ వైపున ఉన్న గడ్డి కలుపును కత్తులతో శుభ్రపరచుకొంటూ కొంత భాగం పూర్తి చేశారు.
కానీ ఈ పని జరుగుతున్నంతసేపూ ప్రతి రోజూ చూస్తూనే ఉన్నా ఏరోజుకారోజు కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు కేంద్రం నుండి NDRF బలగాలు వచ్చి ప్రణాళికాబద్ధంగా వారిదైన పద్ధతిల్లో ప్రజలకు అత్యవసర సేవలందించిన తీరుగా కార్యకర్తలు ఒకరు కొమ్మలను కత్తిరించడం, ఇద్దరు వాటిని చివరకు చేర్చడం, ఇద్దరు వాటిని క్రమపద్ధతిలో అంచు కట్టడం, ఇద్దరు నడవకుండా స్తంభించిన మురుగు కాలువకు అడ్డుపడిన చెత్తను తొలగించి ముందుకు నడిపించడం.
కొందరు దారిని అద్దంలా ఊడ్చి శుభ్రం చెయ్యడం. కొందరు పోగులు డిప్పలకెత్తడం, కొందరు వాటిని లోడింగ్ చెయ్యడం, ఒకరిద్దరు అందరికీ దాహర్తిని తీర్చడం, రధసారధుల వారు సైతం కార్యకర్తలకు కావలసిన పనిముట్లు వారు చేయవలసిన పనులు ఎవరు చేయదగిన పని వారికి అప్పజెప్పే పనిలో పరుగులు పెట్టడం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇంతటి క్రమశిక్షణ, అంకితభావం, సామాజిక బాధ్యత, నిజాయితీ, చైతన్య స్ఫూర్తి, నిస్వార్ధ సేవ చేయగలిగిన వేరొక స్వచ్చంద ఉద్యమ వేదికను భావితరం వేరే ఎక్కడైనా చూడగలదా? అంటే లేదు ఎందుకంటే “ఈ పల్లె అంతటి త్యాగమూర్తులు కన్న తల్లి అందుకే ఇది స్వచ్చ సుందర చల్లపల్లి”.
6 గంటల దాటిన విశ్రమించని 25 మంది కార్యకర్తలు డాక్టరు గారి విజిల్ మ్రోతతో అతి కష్టం మీద పనికి విరామమిచ్చి చెమటతో తడిసి ముద్దైన ఈ గ్రామ సేవకులు కొద్ది నిమిషాలు కాఫీ సేవిస్తూ సేదతీరి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
‘భోగాది వాసు’ మాస్టారు “జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదాన్ని స్ఫ్ఫూర్తివంతంగా చెప్పగా అందరూ స్వరం కలిపి జై కొట్టి,
రేపు కలువవలసిన చోటు ఈ ప్రదేశమే అనుకుని తిరుగు పయనమయ్యారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
01.08.2025.
స్వస్తతకు జై కొట్ట వచ్చును!
నిశ్చలం ఇది దశాబ్దముగా, నిర్నిబంధము ప్రవేశానికి
శక్తిమేర శ్రమించవచ్చును, సమాజానికి హితవొనర్చిన
తృప్తితో ఇల్లు చేరవచ్చును, వృధా కబురుల కన్న వాస్తవ
కృషే మేలని తెలియవచ్చును, స్వస్తతకు జై కొట్ట వచ్చును!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
01.08.2025