పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
21.9.25 ఆదివారం 3598* వ రోజు స్వచ్ఛ శ్రమదాన విశేషములు!
జాతీయ రహదారి ప్రక్కన 2 సం॥లుగా నాటిన మొక్కల పరిరక్షణలో భాగంగా తెల్లవారుజాము 4:22 నిమిషాలకు కార్యకర్తలు హైవే పై కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్ షెల్టర్ వద్దకు చేరుకొన్నారు.
ఆదివారం కావడంతో ముందు నుండీ కార్యకర్తలు వేకువ జామునే పనివద్దకు చేరుకుని కార్యోన్ముఖులయ్యారు. అందరూ కొడవళ్ళు చేతబట్టి మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి గడ్డి, మొక్కలను శుభ్రం చేయడం, మొక్కల పెరుగుదలకు ఆటంకం లేకుండా చేస్తున్నారు.
మరికొంతమంది కార్యకర్తలు స్వాగత ద్వారం నుండి కుడి ప్రక్కన్న పెట్టిన సువర్ణ గన్నేరు మొక్కలకు కర్ర కట్టి, కంప పాతి పాదులు చేసే పని కొనసాగింపుగా వారు ఆ పనిని ముమ్మరం చేస్తున్నారు.
కార్యకర్తలు ఉదయం ఆగిన చోట ఉన్న బస్ షెల్డర్ ప్రాంతం అంతా అపరిశుభ్రంగా ఉండటంతో దానిపై దృష్టి సారించి దాని ముందు వెనుకా, రెండు ప్రక్కలా అద్దంలా శుభ్రపరచారు. హైవే రోడ్డు మీదికి జారిన మట్టిని పారలతో గోకి పల్లాలలో పోశారు.
ఎప్పటిలాగే ఆదివారం ఉత్సాహం వేరు. 6 గం॥ వరకూ ఆడుతూపాడుతూ కేకలతో, జోకులతో పనిని పరుగులు పెట్టించిన చెమటతో తడిసి ముద్దయిన కార్యాకర్తలు విజిల్ మ్రోగగానే పనిని ఆపి కాఫీ సేవిస్తూ పని పాటల ముచ్చట్లతో సేదతీరి తదుపరి ఘట్టమైన సమీక్షలో పాల్గొన్నారు.
ధ్యానమండలి గోళ్ళ వెంకటరత్నం గారు పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి జేజేలు పలికి, వారు చెప్పిన ‘Helping Hands’ కార్యక్రమం గురించి విని, ఈ రోజు 8.30 గంటలకు అవనిగడ్డ వెళ్ళవలసిన కార్యక్రమ సమాచారం డాక్టరు గారు చెప్పగా శ్రద్ధగా విని,
రేపు కలవవలసిన ప్రదేశం హైవే కొత్తూరు జంక్షన్ సమయంలో ఈ బస్ షెల్డర్ వద్దనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
21.09.2025.
ప్రశ్నల పరంపర – 17
స్వచ్ఛ - సుందర రూపశిల్పులు డాక్టరమ్మను, డాక్టరయ్యను
అడగడానికి సాహసించా –“అయ్యా! మీ కష్టార్జితాలను,
శ్రమను, మేధను ఊరి కోసం సమర్పిస్తారెందుకి”ట్లని!
“ఇదొక బాధ్యత – ఇదొక తృప్తీ” - ఇదే వారల సమాధానం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
21.09.2025.