పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
25.09.2025 గురువారం 3602* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషాలు!
తెల్లవారుజాము 4:19 నిమిషాలకు స్వచ్ఛ కార్యకర్తలు హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్ షెల్డర్ వద్దకు వచ్చి పనిముట్లు చేతబట్టి కార్యోన్ముఖులయ్యారు.
హైవేకు రెండవ ప్రక్కన ఉన్న పారిజాతం మొక్కల చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి మొక్కల చుట్టూ పిచ్చి కాడ అల్లుకుని మొక్కల పెరుగుదలకు ఆటంకంగా ఉన్న కలుపును తీసివేసి శుభ్రపరిచారు.
మరికొంతమంది కార్యకర్తలు నిన్న పని చేయగా వచ్చిన చెత్త, తుక్కుని ట్రాక్టర్ లో వేసి చెత్త కేంద్రానికి తరలించారు.
ఒక మాదిరి వర్షం తెల్లవారుజాము 4 గంటల వరకు వచ్చినా కార్యకర్తలు పని మొదలయ్యే సమయానికి వర్షం ఆగిపోవడం స్వచ్ఛ సేవకు ఎలాంటి అంతరాయం లేదు.
ఈరోజు ఇద్దరు కార్యకర్తలు రెండు మిషన్ లు స్టార్ట్ చేసి రెండు ప్రక్కలా మార్జిన్ లోని గడ్డిని కట్ చేయడం జరిగింది.
6 గంటల వరకూ అలుపెరగని 15 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొన్నారు.
కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్‌ఓ గారి సిసి గా ఉన్న స్వచ్ఛ కార్యకర్త ‘తూము వేంకటేశ్వరరావు’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” జై కొట్టి,
రేపు కలువవలసిన ప్రదేశం ఈ బస్ షెల్డర్ వద్దనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
25.09.2025.
ప్రశ్నల పరంపర – 21
అప్పుడప్పుడు చల్లపల్లిలొ అడుగుపెట్టే – పర్యటించే
వాళ్లనడిగా “ఏమిటీ జిజ్ఞాస మీకని – సంగతే”మని
“ఇచటి శ్రమదానోద్యమం మన భవితకొక చుక్కాని, పల్లెల
ప్రగతి మార్గం సుమా!” అంటూ ప్రస్తుతించగ సంతసించా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
25.09.2025.