3603* వ రోజు ....           26-Sep-2025

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

26.09.2025 శుక్రవారం 3603* వ రోజు నాటి స్వచ్ఛ యజ్ఞం!

          ఈరోజు తెల్లవారుజామున 4:20 నిమిషాలకు జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్టాప్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు మొక్కల చుట్టూ కలుపు గడ్డి, పిచ్చి కాడ లాగి మొక్కలను ట్రిమ్ చేయడం, వాలిన, ఒరిగిపోయిన కొమ్మలను కత్తిరించి చెట్లు నిలువుగా పెరిగేలా చేస్తున్నారు.

          అంతకముందు శుభ్రం చేయగా వచ్చిన చెత్తా చెదారాలు ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడం, మొక్కల చుట్టూ కంపను పాతి కట్టడం చేసారు. ట్రాక్టర్ లోడింగ్ పూర్తికాగానే గద్ద గోరు మొక్కలను ఖాళీ ప్రదేశంలో అనగా బస్ షెల్దర్ ప్రక్కన నాటారు.

          ఇటీవల కురిసిన వర్షాలకు హైవేలో రెండు ప్రక్కలా మొక్కలతో పాటు గడ్డి కూడా విపరీతంగా పెరగడం పిచ్చి మొక్కలు బాగా ఎదగడం వలన స్వచ్ఛ కార్యకర్తలకు వాటిని బాగుచేసి మంచి మొక్కలను పెంచడం క్లిష్టమైన పనిగా ఉంది.

          వాతావరణం మబ్బులు కమ్మి చెమట పట్టకుండా చల్లగా ఉండడంతో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా 6 గంటల వరకు శ్రమించారు.

          విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప జరిగే సమీక్షలో పాల్గొని ప్రేమానందం గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి జై కొట్టి,

          రేపు కలవవలసిన ప్రాంతం ఈ హైవే లోని బస్ షెల్డర్ ప్రదేశం అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  26.09.2025.

          ప్రశ్నల పరంపర – 22

సొంతగడ్డ శ్రమోద్యమంబును సుంతకూడా సరకు చేయని

సోదర గ్రామస్తులారా! సూటిగా ప్రశ్నించుచున్నాం

“ఇప్పుడైనా కదలి రారా? ఇంతకంటే సహకరించర?

గ్రామ స్వస్తత కోరుకోరా? ఘనచరిత్ర లిఖించలేరా?..”

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   26.09.2025