పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
27.09.2025 శనివారం 3604* వ రోజు నాటి స్వచ్ఛ సేవల వివరములు!
జాతీయ రహదారి పై కొత్తూరు జంక్షన్ దగ్గరలోని బస్ స్టాప్ వద్దకు తెల్లవారుజాము 4:20 నిమిషాలకు కార్యకర్తలు పనికి సిద్ధమయ్యారు. హైవేకు ఒక ప్రక్కన ఉన్న మొక్కలలో గడ్డిని కలుపును తొలగించి మొక్క చుట్టూ బాగు చేయడం చేస్తున్నారు. అలా చేయడం వలన మొక్కలు తొందరగా పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది.
ఏపుగా పెరిగిన పారిజాతం మొక్కల చుట్టూ పాదులలో గడ్డిని కోసి మొక్కల క్రింది భాగంలో ఉన్న రెమ్మలను, కొమ్మలను ట్రిమ్ చేయడం జరిగింది. బాగు చెయ్యగా వచ్చిన తుక్కును ఒక బృందం కార్యకర్తలు గుట్టలుగా పేర్చి ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడం కోతకు గురైన పెద్ద గుంటలలో వేయడం జరిగింది.
మిషన్ తో ఒక కార్యకర్త, రోడ్ మార్ణిన్ లోని గడ్డిని సమానంగా కత్తిరించడం జరిగింది. నలుగురు కార్యకర్తలు సమా పంలోని కొత్తూరు రోడ్కి మొదట్లో మార్జిన్ లో ఉన్న మొక్కల చుట్టూ బాగు చేసి పరిశుభ్రం చేశారు.
6 గంటల వరకు పనిచేసిన 30 మంది విజిల్ మోగటంతో అందరూ కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొన్నారు.
ఆసుపత్రి సిబ్బంది, స్వచ్ఛ కార్యకర్తలలో ఒకరైన ‘లక్ష్మీ సెల్వం’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి” జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ బస్ షెల్టర్ దాటిన తరువాత అతి కొద్ది దూరంలో అనుకుని తిరుగు పయనమయ్యారు.
ప్రశ్నల పరంపర – 23
చెప్పుదాం మన గ్రామ మందలి స్వచ్ఛ సుందర కార్యకర్తకు -
“మాకు సైతం ఊరిపై అభిమానమెంతో కొంత కలదని!
స్వంత వీధిని బాగుచేయుట మాకు కూడా చేతనౌనని!
అందుకే ఇక మేము కూడా ఊరికంకితమయ్యెదం” అని!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.09.2025