పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
28.09.2025 ఆదివారం 3605* వ రోజు నాటి శ్రమదాన సంగతులు!
జాతీయ రహదారి పై కొత్తూరు రోడ్ క్రాస్ జంక్షన్ సమీపంలో వేకువ జామున 4:23 నిమిషాలకు కార్యకర్తలు చేరుకుని మొదటి ఫోటో దిగి శ్రమదాన యజ్ఞానికి కార్యోన్ముఖులయ్యారు.
కొత్తూరు రోడ్ లోని ఫీడ్ మిషన్ వరకు కొంతమంది కార్యకర్తలు బాగుచేసి అక్కడ ఉన్న కొన్ని మొక్కల కలుపు గడ్డిలో నుండి వాటిని బయటకు తీసి వాటికి గాలి, వెలుతురు తగిలేలా మొక్కలను రక్షించారు.
మరికొంతమంది కార్యకర్తలు నిన్న బాగుచేయగా వచ్చిన తుక్కును ట్రాక్టర్ లో లోడ్ చేసారు. ఆ ట్రాక్టర్ లో ఎత్తిన చెట్ల కొమ్మలు, కలుపు గడ్డిని రహదారి ప్రక్కన కోతకు గురైన ప్రదేశాల్లో వేసి తొక్కుతున్నారు.
కార్యకర్తలలో కొంతమంది కాలేజి రోడ్ మొదట్లో రెండు ప్రక్కలా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మహిళా కార్యకర్తలు అద్దంలా ఊడ్చి శుభ్రం చేశారు.
6 గంటల వరకూ విసుగూ విరామం లేకుండా పనిచేసిన 30 మంది కార్యకర్తలు విజిల్ మోగిన తరువాత ఆగిన ప్రదేశానికి వచ్చి చేతులు శుభ్రపరచుకుని కాఫీ సేవించారు. కాఫీ విరామం అనంతరం జరిగిన సమీక్షలో గోళ్ళ వెంకటరత్నం గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి” జై కొట్టారు.
స్వచ్ఛ చల్లపల్లికి ఆత్మీయులు శ్రీ డా. గోపాళం శివన్నారాయణ గారు ఈరోజు స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని ‘పరోపకారం కొరకు నిస్వార్ధంగా పనిచేస్తున్న మీరు ధన్యజీవులు’ అని కొనియాడారు. చల్లపల్లి అభివృద్ధికి 5,000/- రూపాయల చెక్కును విరాళంగా “మనకోసం మనం” ట్రస్టుకు అందిచారు.
రేపు కలవవలసిన ప్రదేశం హైవేలోని కొత్తూరు క్రాస్ జంక్షన్ వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
28.09.2025.
ప్రశ్నల పరంపర – 24
అప్పుడప్పుడు చల్లపల్లిలొ అడుగుపెట్టే – పర్యటించే
వాళ్లనడిగా “ఏమిటీ జజ్ఞాస మీకని – సంగతే”మని
“ఇచటి శ్రమదానోద్యమం మన భవితకొక చుక్కాని, పల్లెల
ప్రగతి మార్గం సుమా!” అంటూ ప్రస్తుతించగ సంతసించా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
28.09.2025