3606* వ రోజు ....           29-Sep-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

29.09.2025 సోమవారం - 3605* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ విశేషాలు!

               జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ క్రాస్ వద్ద నుండి అవతల వైపు (అవనిగడ్డ వైపు) ఉన్న బస్టాప్ దగ్గర తెల్లవారుజాము 4.15 నిమిషాలకు శ్రమదాన కార్యక్రమం మొదలైంది.

బస్టాప్ వద్ద నుండి రోడ్డు దిగువ భాగాన విపరీతమైన పిచ్చి మొక్కలు, పిచ్చి కాడ వీటిని తొలగించి మంచి నీడనిచ్చు మొక్కలు, పూల మొక్కలకు ఇబ్బంది లేకుండా చేశారు.

               నిన్న రెండవ ప్రక్క బాగు చేయగా వచ్చిన పెద్ద తుక్కు పోగులను మొత్తం ఒక చోటికి చేర్చారు. వర్షానికి తడిసి తుక్కు , చెత్త లోడింగ్ చేయుటకు ఒకింత ఇబ్బందిగా ఉన్నది.

               మరొక కార్యకర్త గడ్డి కటింగ్ యంత్రంతో రహదారి మార్జిన్ లోని గడ్డిని సమాంతరంగా కట్ చేస్తున్నారు.

               6 గం.ల వరకు శ్రమించిన 18 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే  పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొని,

               ‘అడపా గురవయ్య’ మాష్టారు చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి మాష్టారు పలికిన నీతి సూక్తులు విని,

రేపు కలవవలసిన ప్రదేశం ఈ బస్ షెల్టర్ వద్దే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  29.09.2025.

కథాసమయం - ఫల శ్రుతి మయం.

కథ విందువా స్వచ్ఛ కథ విందువా

కను విప్పు కలిగించు కథవిందువా!     కథవిందువా॥

పల్లెనూ కాదు - నే పట్టణాన్నీ కాదు

చల్లపల్లిని నేను నేను చరిత కెక్కినదాన్ని

కృష్ణ జిల్లాలోన కీర్తి పొందినదాన్ని

ఎన్నెన్నో ఒడుదొడుకు లెదుర్కొనిన దాన్ని

ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చితి నేను

               కథవిందురా నా వ్యథవిందురా

               కనువిప్పు కలిగించు కథ విందురా!

ఎన్నొ ఉన్నవి గాని స్వచ్ఛ శుభ్రత లేని,

ఆహ్లాదకరమైన వాతావరణము లేని,

కళా కాంతులు లేని గ్రామ వీధులు నావి!

అందుకే ఆరోగ్యమంతంత మాత్రముగ

మిగిలి పోతిని నేను - పొగిలి పోతిని నేను

               కథవిందురా మనోవ్యధవిందురా

               కను విప్పు దొరికిన కథ విందురా!        - సశేషం

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   29.09.2025