3607* వ రోజు ....           30-Sep-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

30.09.2025 మంగళవారం – 3606* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన యజ్ఞం!

               తెల్లవారుజామున 4.18 నిమిషాలకే స్వచ్ఛ కార్యకర్తలు హైవే రోడ్డులోని కొత్తూరు క్రాసింగ్ జంక్షన్ వద్ద బస్ షెల్డర్ వైపు పనిచేయుటకు కార్యోన్ముఖుల్యారు. ఒక్కొక్కరు వారు చేయవలసిన పనికి తగిన పనిముట్లు తీసుకుని రోడ్ మార్జిన్ లో ఉన్న కలుపు, పిచ్చి మొక్కల పని చూడడానికి బయల్దేరారు.

షెల్డర్ వెనుక భాగంలో ఒక కార్యకర్త ఏపుగా పెరిగిన పిచ్చి కంపను నరికి పరిశుభ్రం చేశారు. ఆ ప్రక్కనే మరికొంత మంది కార్యకర్తలు గద్దగోరు, తురాయి మొక్కలను చుట్టుముట్టి ఆటంకంగా ఉన్న పెద్ద పెద్ద పిచ్చి మొక్కలను మొదలుకంటూ తీసివేసి ఎంతో అందంగా చేశారు.

ఇంకొంతమంది కార్యకర్తలు గత 2 రోజుల నుండి అక్కడక్కడా వదిలిన, కంప, తుక్కును ట్రాక్టర్ లో లోడ్ చేశారు.

స్వచ్ఛ కార్యకర్తల కఠోరమైన శ్రమ వలన నేడు ఆ బస్ షెల్డర్  ప్రాంగణమంతా ఎంతో పరిశుభ్రంగా ఉంది.

కొత్తూరు క్రాసింగ్ నుండి దారికి అటు ఇటు వైపు మార్జిన్ లో గడ్డిని మరొక కార్యకర్త మిషన్ తో అందంగా కట్ చేస్తున్నారు.

               6 గంటల వరకూ విశ్రమించని 21 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే  పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప,

               ‘మాలెంపాటి అంజయ్య’  గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,

రేపు కలవవలసిన ప్రదేశం ఈ హైవే లోని బస్ షెల్టర్ వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

 30.09.2025.

కథాసమయం - ఫల శ్రుతి మయం

(నిన్నటి తరువాయి)

వ్యథ తీరునట్లుగా - కథలోన మలుపుగా

జరిగెనొక సంఘటన పది ఏళ్ల (12-11-14) ముందుగా.....

....కాలానుగుణమైన గ్రామ మార్పులకు జన

విజ్ఞాన వేదికను సంస్ధ ముందుకు వచ్చె

చైతన్యవంతులను చేరదీసెను సంస్థ

               కథవిందువా మార్పు కథవిందువా

               నాజాతకము మార్చు కథవిందువా!

కథాసమయం - ఫలశ్రుతి మయం

తొలి ప్రయత్నముగ గంగులవారిపాలెము

బాట శుభ్రము చేసి, బహిరంగ మలవిస

ర్జన నాపి, పూల చెట్లను పూల చెట్లను నాటి పెంచారు

మలి ప్రయత్నం - చల్లపల్లి వీధుల సంస్క

రింపబూనితిరి నా చరిత్ర మలుపులు తిప్పి

               కథ విందురా చరిత్రను కందురా

               కథలోన వృథ తీరి సుధ కందురా!

తెల్లవారకముందె నలుబదేబది మంది

నా ప్రతిష్ఠను పెంచ కష్టపడుతుంటారు.

నా వీధులూడ్చి, చెట్లను పెంచుతుంటారు

వరపుత్త్రులగు వాళ్ల ఋణమెట్లు తీర్చెదనొ

గ్రామస్తులింకెపుడు సహకరిస్తారొ మరి!

               అనుమానములు తీర్చి, ఆత్మస్థైర్యము నింపు

               కార్యకర్తల శ్రమల కథవిందురా!           కథవిందురా ॥

(సశేషం)

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  30.09.2025