పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
03.10.2025 శుక్రవారం - 3610* వ రోజు నాటి స్వచ్ఛ సేవా కార్యక్రమాలు!
ఈ రోజు జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ కు అతి సమీపంలో ఉన్న బస్ స్టాప్ వద్ద కార్యకర్తలు పనిముట్లు చేతబట్టి కార్యరంగంలోకి దిగారు. తెల్లవారుజాము 4.25 నిమిషాలు అవుతున్న సమయంలో గ్రామ శుభ్రత కోసం అంత దూరం ఎవరూ పిలవకుండా దశాబ్ద కాలం పైగా వచ్చి పని చేయడం అభినందనీయం.
కొంతమంది కార్యకర్తలు కత్తులు చేతబట్టి గద్దగోరు మొక్కల చుట్టూ బాగు చెయ్యడం, అనగా కలుపు గడ్డి లేకుండా తీసివేయడం, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించుకొంటూ మొక్కలను చూడటానికి అందంగా తయారు చేస్తున్నారు. వీరు చేస్తున్న పనికి గాను వచ్చిన చెత్తా, తుక్కు కొమ్మల వ్యర్ధాలను మహిళా కార్యకర్తలు లోడింగ్ కు అనుకూలంగా ఉండే లాగున గుట్టలుగా పేర్చుతున్నారు.
కార్యకర్తలలో ఒక బృందం (రెస్క్యూ టీం) సభ్యులు నిన్నటి చెత్తా చెదారం వ్యర్థాలను ట్రాక్టర్ లో లోడింగ్ చేస్తున్నారు. ఆ వెనుక మరొక మహిళా కార్యకర్త ఎంతో పరిశుభ్రంగా ఊడ్చి వేస్తుండటం గమనిస్తే చేసిన పని ఎంత పరిశుభ్రంగా అద్దంలా మెరుస్తుందో చూసిన వారికే తెలుస్తుంది.
అలాగే గడ్డి కటింగ్ యంత్రానికి మాత్రం చేతి నిండా పని రహదారికి రెండు ప్రక్కలా మార్జిన్ లలో పెరిగిన చెత్తను కత్తిరించి మొక్కలు మాత్రమే చూపరులకు ఆకర్షణీయంగా కనపడేది రోజూ మిషన్ తో కార్యకర్త కత్తిరించుట వలనే.
6 గంటల వరకు విరామమెరుగని స్వచ్ఛ శ్రామికులు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవిస్తూ పని ముచ్చట్లతో కొద్ది నిముషాలు సేద తీరిన అనంతరం జరిగిన సమీక్షలో పాల్గొని,
‘వీర సింహుడు’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టారు.
డాక్టరు గారు మాట్లాడుతూ మనం రోజువారీ జీవితంలో మంచి మానవ సంబంధాలు కలిగి
ఉండటానికి అందరం ఆచరించవలసిన కొన్ని నియమాలు చెప్పగా శ్రద్ధగా విని,
రేపు కలువవలసిన ప్రదేశం ఈ హైవే పై కొత్తూరు జంక్షన్ సమీపంలో ఉన్న ఈ బస్ షెల్టర్ ప్రాంగణమేనని అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
03.10.2025.
ముక్త్యాలా! హే ముక్త్యాలా! - 1
ముక్త్యాలా! ఓ ముక్త్యాలా! నీ సేవకులందరు ముత్యాలా?
వందరోజులుగ ప్రతి ప్రత్యూషం వీధి మెరుగుదల ప్రయత్నాలా?
ప్రజాస్వస్తతకు – గ్రామ శుభ్రతకు పాటుబడుతున్న రత్నాలా?
గ్రామ సమాజపు ప్రయోజనార్థం పదిహేనిరవై వజ్రాలా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
03.10.2025