3624* వ రోజు ....           17-Oct-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

3624* వ రోజు అనగా 17.10.2025 శుక్రవారం నాటి శ్రమ విన్యాసాలు!

వేకువ 4:18 నిమిషాలకు కొద్దిమంది కార్యకర్తలు అమరస్ధూపం వద్ద కలుసుకుని ముందుగా మేము శ్రమదానానికి సిద్ధమని ఫోటో దిగి పనిలో దిగిన పిదప ఒక్కొక్కరి చేరికతో ఆ కొద్దిమంది కాస్త చివరి ఫొటోతో 36 మందిగా తేలి,

నేడు కార్యకర్తలంతా గ్రూపులుగా విడిపోయి

1) రోడ్ల ప్రక్కన మార్జిన్లలో ఏపుగా పెరిగిన గడ్డిని, మొక్కల చుట్టూ ఉన్న కలుపును తొలగించడం,

2) దారి కిరుప్రక్కలా త్రాగి పడేసిన మద్యం సీసాలను, వాటర్ పాకెట్లను, ప్లాస్టిక్ గ్లాసులను ఏరి సంచుల్లోకి ఎత్తడం,

3) గడ్ది కోత మిషన్ నిపుణుడు మాత్రం రోడ్డు ప్రక్కల గడ్డిని సమానంగా కట్ చేయడం,

4) అమరస్థూపం ముందు ఉన్న గార్డెన్ లో పేరుకుపోయిన చెత్తను, కలుపును, గడ్డిని చేతులతో లాగి అక్కడున్న మొక్కలు ఊపిరి పీల్చుకునేలా చేయడం,

5) మహిళా కార్యకర్తలు మాత్రం రోడ్డును ఊడ్వడం,

               ఇలా 6 గంటల వరకూ శ్రమదానం చేసిన తర్వాత  ఆరోడ్డు చూస్తే ఎంత విశాలంగానో చూడగానే ‘వావ్’ అనిపించేలా ఉంది.

               6:10 నిమిషాలకు విజిల్ మ్రోగగానే పనికి సెలవిచ్చి, కాఫీ లు సేవించిన పిదప సమీక్షలో పాల్గొని,

               స్వచ్ఛ కార్యకర్త ‘గంధం బృందావన్ కుమారుని’ నినాదాలకు కార్యకర్తలంతా బదులిచ్చి,

అడపా గురవయ్య గారి నీతి వాక్యాలు విని,

               రేపు కూడా ఇదే అమరస్థూపం వద్ద అని తెలుసుకుని ఇంటి బాట పట్టారు.   

- దాసరి రామకృష్ణ ప్రసాదు

    17.10.2025.

మూడు వేలా ఆరువందల - 1

మూడు వేలా ఆరువందల పని దినాల చరిత్ర గొప్పది

ఐదు లక్షల గంటల శ్రమ కంతమే కనిపించకున్నది

పచ్చదనములు, స్వచ్ఛ శుభ్రత పరిఢవిల్లుచు చల్లపల్లిని

సమూలముగా మార్చు వరకూ శ్రమోద్యమ మసలాగకున్నది!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   17.10.2025