3625* వ రోజు ....           18-Oct-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

18.10.2025 శనివారం - 3625* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషాలు!

               వేకువ జామున 4.16 ని.లకు నాగాయలంక రోడ్ లోని అమర స్థపం వద్ద కార్యకర్తలు చేరుకుని స్వచ్ఛ సేవకు సమాయత్తమయ్యారు. ఎవరికి కావలసిన పనిముట్లు వారు చేతబట్టి వడివడిగా ముందుకు నడిచారు. గత 4 రోజుల నుండి నాగాయలంక రోడ్ లోని కాసానగర్ మలుపు వద్ద నుండి స్వచ్ఛ సేవ జరుగుతూ ఉన్నది.

               కొద్ది రోజులుగా ఈ దారిలో చేస్తున్న పనికి తుదిమెరుగులు దిద్దే పనిలో భాగంగా రహదారి మార్జిన్ లో ఉన్న చిత్తు కాగితాలు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లు ఖాళీ వాటర్ బాటిల్స్, ఖాళీ సీసాలు ఇలాంటి వ్యర్థాలన్నీ ఏరివేస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టారు.

               కొంతమంది కార్యకర్తలు అంతకు ముందు మిగిలిన పురుడు కంప, గడ్డి, పిచ్చి మొక్కలు అన్నీ లేకుండా చెయ్యడంతో ఆ ప్రాంతం ఎంతో విశాలంగా ఉంది. మరొక బృందం వారు కొట్టగా వచ్చిన తుక్కును మురుగు డ్రైను అంచులకు ఒక క్రమ పద్ధతిలో పేర్చుకుంటూ వచ్చారు. మధ్యలో అడ్డుగా పడిపోయిన  నిద్ర గన్నేరు  మొదళ్ళను మిషన్ రంపంతో కట్ చేసి వాటిని వారి నైపుణ్యంతో కూర్చునే బల్లలుగా మలిచారు. రహదారి మార్జిన్ లోని గడ్డిని మిషన్ రంపంతో కట్ చేయడం వలన ఇప్పుడు చూస్తే  రహదారి మరింత సుందరంగా ఆకర్షణీయంగా ఉంది.

               6 గం.ల వరకు విశ్రమించని 38 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొని,
               లక్ష్మి సెల్వం గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి కి జై కొట్టి
, రథ సారథుల వారు సెప్టెంబర్ నెల ట్రస్టు జమా ఖర్చుల వివరాలనందించగా ఆలకించారు.

               గురవయ్య మాష్టారు చెప్పిన నీతి సూక్తులు విని రేపు కలవలవవలసిన ప్రదేశం ఈ నాగాయలంక రోడ్ లోని అమరస్థూపం వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

   18.10.2025.

ఏమిటా కసి?

ఏమిటా కసి? కలుషములపై మీ నిబద్ధత ఎంత గొప్పది!

నెలల తరబడి విశ్రమించక - నీరసించక – ఒకే ఒక రహ

దారి లోపల గడ్డి పెరికీ - మొక్కమొక్కకు కంపగట్టీ

సుందరముగా, తీర్చిదిద్దుచు నందనముగా మార్చుచుండిరి!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   18.10.2025