3629* వ రోజు .....           22-Oct-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

22.10.25 బుధవారం @3629* రోజు నాటి స్వచ్ఛ సేవా యజ్ఞం!

నాగాయలంక రోడ్ లోని ఆశ్రమం ముందు ఈ రోజు తెల్లవారుజాము 4.20 నిమిషాలకు కార్యకర్తలు చేరుకొని శ్రమ యజ్ఞం ఆరంభించారు.రోడ్డు పొడవునా నిన్న చేసిన పని నిమిత్తం చెత్త, కంప, తుక్కు కాగితాల తో ఉన్న పోగులను మొత్తం ఎత్తివేయదలచారు.

డిప్పలతో పోగులు ఎత్తడం మరికొందరు మోయడం, దీనికి ముందుగా ఇద్దరు మహిళా కార్యకర్తలు చెత్త గుట్టలలో ఉన్న అతి సూక్ష్మాతి సూక్ష్మమైన చెత్తను సైతం ఏరివేయడంతో చెత్తను  మాత్రమేలోడింగ్ చేశారు.

అనంతరం వెనుక మరో ముగ్గురు  మహిళా కార్యకర్తలు ఊడ్చి రహదారినంతా శుభ్ర పరిచారు. మరొక కార్యకర్త మిషన్ రంపంతో గడ్డి ని కట్ చేయగా రోడ్ మార్జిన్ ఎంతో సుందరంగా ఉన్నది. మరికొంతమంది కార్యకర్తలు రోడ్డు కుడి ఎడమల దిగువ భాగంలో ఉన్న కలుపు, గడ్డిని, వంకరగా పెరిగిన అడవి తంగేడు కొమ్మలను కత్తిరిస్తూ బాగు చేశారు.

6 గం.ల సమయం దాటే వరకు విశ్రమించని కార్యకర్తలు తదుపరి విజిల్ మ్రోగగానే డా. పద్మావతి మేడం గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి గొంతు కలిపి రేపు కలువవలసిన ప్రదేశం ఈ నాగాయలంక రోడ్ లోని రైస్ మిల్లు వద్దనే అనుకుని నిష్క్రమించారు.   

- నందేటి శ్రీనివాస్

ప్రజా కళాకారుడు

22.10.2025.

“గ్రామమంటే ఇది కదా”

ఎవ్వరైనా కొంచెమాగి ఒకింత వింతగ కాంచదగినది

“గ్రామమంటే ఇది కదా” అని కన్నులార్పక చూడదగినది

ఎక్కడెక్కడి వారొ వచ్చి ప్రశంసించక తప్పనట్టిది

“స్వచ్ఛ సుందర చల్లపల్లని” సార్థకంగా చెప్పదగినది!

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

22.10.2025