పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
24.10.25 శుక్రవారం @3631* రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషాలు!
నాగాయలంక రోడ్ లోని ప్రభాకర్ రైస్ మిల్లు ప్రాంగణం ముందు ఈ రోజు వేకువ జామున 4.23 ని.లకు కార్యకర్తలు శ్రమ యజ్ఞానికి సిద్ధమైనారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన పని చేయుటకు పూర్తి అనుకూలత లేకపోయినప్పటికీ కార్యకర్తలు పట్టుదలతో కొంత పనిని పూర్తి చేయాలనే తపనతో పనిముట్లు చేతబట్టి ముందడుగు వేశారు.
నిన్న పని చేయగా వచ్చిన కొమ్మలు, చెత్త, గడ్డి మొదలగునవి నలుగురు కార్యకర్తలు ట్రాక్టర్ లో లోడ్ చేస్తుండగా మరి కొంతమంది రైస్ మిల్ పొడవునా ఉన్న గార్డెన్ లో నుంచి చెట్లు, కంప బయటకు వచ్చి మెస్ వెలుపల అందవిహీనంగా ఉండటంతో వరుసలో అక్కడ కార్యకర్తలు కొమ్మలు కొట్టడం, బోగన్ విలియా కంపను కత్తిరించడం, గార్డెన్ వెలుపల క్రింది భాగంలో ప్రాకిన దొండ కాడ అంతా కత్తులతో కోసి ఎంతో పరిశుభ్రంగా చేశారు.
రహదారి ప్రక్క మార్జిన్ ను ఒక కార్యకర్త మిషన్ తో కట్ చేయడం వలన కార్యకర్తలకు ఆ పని శ్రమ తగ్గినట్లయింది. ఎవరికి వారే ఈ పని నాది అని ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కార్యకర్తలకు ఒక అలవాటుగా మారిపోయింది.
6 గం.ల వరకు పని చేసిన 24 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పని విరమించి కాఫీ సేవించిన పిదప ఆంధ్రజ్యోతి పత్రికా విలేఖరి బ్రహ్మం గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లికి గొంతు కలిపి,
రేపు కలుసుకోవలసిన ప్రదేశం నాగాయలంక రోడ్డు లోని ప్రభాకర్ రైస్ మిల్లు వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
24.10.2025.
శ్రమోద్యమములు సాగ వెందుకు?-2
పెద్ద వైద్యులు, న్యాయవాదులు, ప్రథమ మహిళలు, వృద్ధమూర్తులు
సొంత పనిగా ఊరి పనులను సంతసముగా నిర్వహించుట -
శ్రమార్జితమును సమర్పించుట చల్లపల్లి లోన మినహా
మచ్చుకైనా ఒక్క గ్రామంలోననూ కనిపించ వెందుకు?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
24.10.2025