పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
25.10.25 శనివారం @3632* రోజు నాటి శ్రమదాన ఘట్టములు !
ఈ రోజు తెల్లవారు జాము 4.2 ని.లకు నాగాయలంక రోడ్ లోని ప్రభాకర్ రైస్ మిల్లు వద్దకు కార్యకర్తలు చేరుకొని ప్రధమ ఘట్టమైన గ్రూపు ఫోటో దిగి పనిముట్లతో సిద్ధమయ్యారు.
ఈ రోజు కార్యాచరణ ప్రకారం నిన్న చేసిన పనికి గార్డెన్ నుండి వచ్చిన చెత్తను ట్రాక్టర్ లో ఎక్కించడానికి 6 గురు కార్యకర్తలు సమాయత్తమయ్యారు. బోగన్ విలియా ముళ్ళ తోనే ఆ చెత్తంతా ఉంది మరియు మహిళా కార్యకర్తలు ఆ చెత్తలో ఇమిడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సీసాలను, క్యారీ బ్యాగులను ఏరి వేస్తున్నారు.
మరికొంతమంది కార్యకర్తలు మిల్లు వద్ద నుండి పబ్లిక్ టాయిలెట్స్ వరకూ కత్తులతో కలుపు, గడ్డిని మరియు అడవి తంగేడు పూల చెట్ల చుట్టూ కొమ్మలు క్రింది భాగంలో పాదులు చేయడం మొదలగు పరిశుభ్రతా చర్యలు చేపట్టారు.
మరొక కార్యకర్త గడ్డి కటింగ్ మిషన్ తో రహదారి మార్జిన్ లు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నాడు. దాని వలన రహదారి మరింత వెడల్పుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
6 గం.ల వరకు పని చేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చిన 26 మంది కార్యకర్తలు కాఫీ సేవించిన పిదప కస్తూరి శ్రీనివాసరావు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి కి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ నాగాయలంక రోడ్ లోని ప్రభాకర్ రైస్ మిల్లు వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
25.10.2025.
శ్రమోద్యమములు సాగ వెందుకు?-3
ప్లాస్టిక్ పాపం ప్రోగు పెట్టుట కన్ని ఊళ్లూ సమానమే గద
ఆకులలములు దుమ్మూ ధూళీ అన్ని చోట్లా కామనే గద
హరిత సంపద శుచీ శుభ్రతలన్ని వీధుల మృగ్యమే గద
చల్లపల్లిలొ జరిగినట్లుగ శ్రమోద్యమములు సాగ వెందుకు?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
25.10.2025