పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
30.10.2025 గురువారం 3637* రోజు నాటి స్వచ్చ సేవా యజ్ఞం!
ఈరోజు వేకువజాము 4:18 కే కార్యకర్తలు బైపాస్ రోడ్డులో బాలికల హాస్టల్ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చేతి నిండా పని సిద్ధంగా ఉండడంతో పనిముట్లు చేతబట్టి కార్యరంగానికి ముందడుగేశారు.
తుఫాను ప్రభావంతో 28 వ తేదీ సాయంత్రం నేలకొరిగిన చెట్లను అప్పుడు వర్షంలో తడుస్తూ ప్రక్కకు తొలగించి రహదారి సౌకర్యం కల్పించారు. కానీ అవి దాదాపు 4 ట్రక్కుల కొమ్మలు, ఆకులను డంపింగ్ యార్డ్ కు తరలిస్తే అక్కడ ఖాళీ ఆక్రమించడం తప్ప, తగలేస్తే కాలుష్యం ముప్పు వీటన్నింటికీ పరిష్కారంగా షడ్దర్ మిషన్ లో వేసి ఆకులు కొమ్మలను పొడి చెయ్యడం, మొద్దులను ఇతర అవసరాలకు కర్రలను మొక్కలకు దన్నుగా వాడడం ఇదీ రధసారది గారు కార్యకర్తలకు చెప్పిన ప్రత్యామ్నాయ పద్ధతి.
ఇక కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎవరి పని వారు కేటాయించుకుని ఇద్దరు, ముగ్గురు విడగొట్టడం, కొందరు కొమ్మలను మొండిగా వేయడంమరికొందరు వాటిని మిషనుకు చేర్చడం, ఇద్దరు వ్యక్తులు వాటిని యంత్రంలో చాకచక్యంగా వేయడం, కొందరు మొద్దులను ప్రక్కకు నెట్టడం ఒకరు మిషనుతో అవసరం మేరకు ముక్కలుగా కట్ చెయ్యడం ఇద్దరు గుట్టలుగా వేయడం పని పూర్తయిన ప్రదేశాన్ని ఇద్దరు చీపుళ్ళతో శుభ్రం చెయ్యడం.
దాదాపు 28 మంది కార్యకర్తలు రెప్పపాటు దృష్టి మరల్చకుండా ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రం (ప్రోసెసింగ్ యూనిట్) లో పని చేసినట్లు ఈ ఊరి బాగు కొరకు స్వచ్చంద సేవ చేయడం ఒక చల్లపల్లికే సాధ్యమయింది.
ప్రకృతి వైపరీత్యం వలన అనేక జిల్లాలు గాలి ప్రళయంతో రహదారులన్నీ చెట్ల కొమ్మలు, రెమ్మలు, ప్లాస్టిక్ వ్యర్ధాలతో చిన్నాభిన్నంగా ఉంటే ఆ పని కూడా చేయవలసింది ప్రభుత్వం వారేగా, మన ఇంటి ముందు చెత్త కూడా తీయడం ప్రభుత్వ బాధ్యతే అని అనుకునే ఈ రోజుల్లో మన గ్రామంలో ఎక్కడ అలాంటి అవసరం ఉన్నా మేమున్నామంటూ స్వచ్చ సైనికులు వారి వారి పనిముట్లు, యంత్రాలు, వాహనాలతో ముందడుగేస్తుంటే మేము సైతం మీతోనే అంటూ పోలీసులు, పంచాయితీ వారు, మనకోసం మనం’ ట్రస్టు సిబ్బంది, రెడ్ క్రాస్ వారు ఇలా అందరూ కలిసి ముందడుగేసే సంస్కృతిని స్వచ్చోద్యమం ద్వారా పుణికి పుచ్చుకున్న ఊరుమాత్రం మన చల్లపల్లే,
అలా 6 గంటల సమయం దాటి విజిల్ మ్రోగే వరకు పని విరమించని కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవిస్తూ కొద్ది నిమిషాలు ఒంటి చెమట ఆరనిచ్చి సమీక్షలో పాల్గొన్నారు.
గ్రామ ప్రధమ పౌరురాలు పైడిపాముల కృష్ణకుమారి గారు స్ఫూర్తివంతమైన స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి స్వరం కలిపి అందరూ జై కొట్టారు.
రేపు కలవవలసిన ప్రదేశం ఈ బాలికల హాస్టల్ ప్రాంతమే అయినా ఈ సాయంత్రం అందరూ వాట్సప్ చూద్దాం అనుకుని నిష్క్ర మించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
30.10.2025.
రాష్ట్రమంతట నిండిపోవా? – 3
చల్లపల్లే రాష్ట్ర మందలి పల్లెలకు ఆదర్శమైతే -
శ్మశానాలూ, శుభ్ర వీధులు సర్వజనతా కర్షమైతే -
ఈ కళాత్మక గ్రామ శుభ్రత ఎల్లవారికి స్ఫూర్తి ప౦చితె -
స్వచ్ఛ సుందర చల్లపల్లులు రాష్ట్రమంతట నిండిపోవా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
30.10.2025