3639* వ రోజు . ....           01-Nov-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

01.11.2025 శనివారం - 3639* వ రోజు నాటి స్వచ్ఛ సేవా విశేషాలు!

               ఈ రోజు తెల్లవారు జామున బైపాస్ రోడ్ లోని విజయ్ నగర్ కాలని ప్రాంతంలో కార్యకర్తలు చేరుకుని నిన్నటి పనికి కొనసాగింపుగా పనిముట్లు చేతబట్టి కార్యక్రమంలోకి ముందడుగు వేశారు.

               బాలికల హాస్టల్ ప్రాంగణం నుండి బైపాస్ రోడ్ లోని HDFC బ్యాంకు పరిధి వరకు తుఫానుకు పడిపోయిన, వంగిపోయిన విరిగిపోయిన చెట్లను, కొమ్మలను కత్తిరించి మొద్దులను ప్రక్కకు నెట్టి పరిశుభ్రం చేయడం, ఈ టన్నుల కొద్దీ వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించి తగులబెట్టకుండా ప్రత్యామ్నాయంగా షడ్దర్ లో వేస్తున్నారు.

               ఈ పని ఒక క్రమ పద్దతిలో జరుగుతుంది. అనేకమంది కార్యకర్తలు 2 గంటల పాటు శ్రమించి ఆ కొమ్మలను, ఆకులను ముళ్ళ కంపను దశలవారీ క్రియలతో పొడి ఆడడం అదంతా ఒక పెద్ద క్లీన్ ఆపరేషన్.

               49 మంది కార్యకర్తలు ఈ రోజు విజయ్ నగర్ నుండి బైపాస్ రోడ్ చివర వరకు ఉన్న చెట్ల కొమ్మలను మొత్తం ట్రక్కులలో ఒక చోటకు చేర్చి ఆ మిషన్ తో చేసే ప్రోసెసింగ్ ప్రత్యక్షంగా చూస్తుంటే ఒక పెద్ద కర్మాగారంలో తెల్లవారు జాము షిప్టు  కార్మికులు పని చేస్తున్నట్లుగా ఉంది.

               ఈ యజ్ఞంలో అనేకమంది యువకులు పాల్గొని తుఫాన్ ప్రభావంతో అస్తవ్యస్తమయిన మన స్వచ్ఛ రహదారులకు గత సౌందర్యాన్ని తీసుకువచ్చి చర్యలు చేపడుతున్నారు. “యువతరం శిరమెత్తితే – నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా- ఈ చీకటి మాసిపోదా” అన్న ప్రజాకవి రచనకు సజీవ సాక్ష్యం ఈ రోజు స్వచ్ఛ సేవలో యువకుల రెక్కల కష్టం.

               6.35 నిమిషాల వరకు పనిచేస్తూనే విజిల్ మ్రోగగానే పని విరమించి కాఫీ సేవిస్తూ సంతోషంగా పనిపాటల ముచ్చట్లతో సేదతీరి

               మెకానిక్ (ఆకుల) రవి పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జేజేలు పలికి,

               రేపు మనం కలవవలసిన ప్రాంతం మెయిన్ రోడ్ లోని SBI దగ్గర అని నిర్ణయించుకొని అందరూ కొండంత సంతోషంతో ఇంటి బాటపట్టారు.      

- నందేటి శ్రీనివాస్

  01.11.2025.

అట్టి దాసరి రామమోహన

అసలు తొంభై ఐదు ఏళ్ళూ అవనిపై నుండడం గొప్పే!

తనదు గ్రామపు మంచి చెడ్డలు తరచి చూచుట మరీ ఘనతే!

స్వార్జితం లక్షోపలక్షలు సమర్పించుట కూడ అరుదే !

అట్టి దాసరి రామమోహన ఆర్యునికి నే నంజలించెద!              

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    01.11.2025