పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
02.11.2025 ఆదివారం - 3640* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమైక జీవన సౌందర్యం!
ఈ రోజు బందరు రోడ్ లోని SBI దగ్గర తెల్లవారుజాము 4:18 నిమిషాల కల్లా స్వచ్ఛ కార్యకర్తలు చేరుకోగా, గత కొన్ని నెలలుగా వర్షాకాలం అగుట చేత మెయిన్ రోడ్ లోని దుమ్ము చీపుళ్ళతో శుభ్రం చేయడానికి వీలుకాని పరిస్థితి, రహదారిపై రెండు ప్రక్కలా సగభాగం దుమ్ము మందంగా పట్టి ఉంది.
గస్తీ గది వద్ద నుండి మొదలుకొని బందరు రోడ్ పొడవునా రోడ్లపై సగభాగం నిండిన దుమ్ము, రెండు ప్రక్కలా మార్జిన్ లో వేసే చెత్త వివిధ రకాలైన వ్యాపారాలు చేసే షాపుల వారి వ్యర్ధాలు వీటన్నింటినీ శుభ్రం చేసే ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎక్కువమంది కార్యకర్తలు ఆదివారం వారివారి పనులను సైతం ప్రక్కన బెట్టి పాల్గొన్నారు.
గస్తీ గది ప్రక్కనే ఉన్న కాలువలో సమీపంలోని హోటల్ వ్యాపారులు, చికెన్ షాపు వారు వారికి సంబంధించిన వ్యర్ధాల మూటలను అక్కడే కాలువలో వెయ్యడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతుంది. కార్యకర్తలు ఆ ప్రాంతమంతా బాగుచేశారు. చల్లపల్లి పొలిమేర ప్రారంభంలో అలా కోళ్ళ వ్యర్ధాలు, హోటల్ వ్యర్ధాలు వేయడం సమంజసమా?
6 గంటలు దాటే వరకూ 56 మంది కార్యకర్తలు శ్రమించి గస్తీ గది నుండి రిజిష్ట్రారు ఆఫీసు వరకు శుభ్రపరిచారు. విజిల్ మోతతో పని విరమించి కాఫీ సేవించి తదుపరి సమీక్షలో టీచర్ ‘విజయరమ’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” జై కొట్టారు.
స్వచ్ఛ కార్యకర్త ‘తూము వెంకటేశ్వరరావు’ గారు తన మనవడు ‘విరాజ్’ పుట్టినరోజు సందర్భంగా 2,000/-, డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు నెలవారీ చందా 2,000/- రూపాయలను స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం రధసారధుల వారికి అందజేశారు.
నేను పాడిన “ఒక్కరోజైనా ఒక్క సారైనా స్వచ్ఛ కార్యకర్తగా బ్రతుకు మిత్రమా” అంటూ ఆలపించిన గేయాన్ని విని,
రేపు మనం కలవవలసిన ప్రదేశం ఈ బందర్ రోడ్ లోని SBI వద్ద అనుకుని తిరుగు ముఖం పట్టారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా గాయకుడు
02.11.2025.
“స్నేహ దాసరి” వంటి యువతులు
దుబాయ్, అమెరిక దేశములలో దొడ్డ ఉద్యోగాలు చేసిన -
మధ్యమధ్యన చల్లపల్లికి వచ్చి శ్రమదానము లొనర్చిన -
“స్నేహ దాసరి” వంటి యువతులు మనకు ఆదర్శమో కాదో
చెప్పవలెనని కోరుతున్నా చల్లపల్లి గ్రామ ప్రజలను!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
02.11.2025