3641* వ రోజు . ....           03-Nov-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

03.11.2025 సోమవారం - 3641* వ రోజు నాటి శ్రమదాన సన్నివేశాలు!

               ఈ రోజు తెల్లవారుజామున 4:18 నిమిషాలకు కార్యకర్తలు బందరు రోడ్ లోని SBI  వద్దకు చేరుకొని పనికి సిద్ధమయ్యారు.  

               SRYSP కాలేజి ప్రాంగణమంతా 2014 కు ముందు చాలా దుర్గంధభరితంగా ఉండేది. రహదారి మార్జిన్ లో రెండు పెద్ద పెద్ద పబ్లిసిటీ హోర్డింగ్ లు, ఆ ప్రాంత వాసుల ఇళ్లలోని వ్యర్ధాలు, మరీ ముఖ్యంగా ప్రతి ఒకరికీ అదొక బహిరంగ మూత్ర విసర్జనశాల దానితో ఆ ప్రాంతమంతా వర్షం వచ్చినట్లుగా ఎప్పుడూ తడి ఆరకుండా దుర్గంధం వెదజల్లుతూ ఉండేది.

               కానీ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం ప్రారంభించిన కొద్ది కాలానికే ఆ ప్రాంత పరిసరాల రూపురేఖలు మార్చి మేడమ్ గారు 80 వేల రూపాయలకు పైగా నిధులతో ఆ ప్రాంగణం అనగా కాలేజి పొడవునా రోడ్డు వెంబడి ఉద్యానవనాలు నిర్మించి పొలిమేర మొదట్లోనే, సువర్ణ గన్నేరు, బోగన్ విలియాలు, పూల సోయగాలు అలరించే చర్యలు చేపట్టారు. కావున ఈరోజు ఆ ప్రాంతం చాలా పరిశుభ్రంగా ఉంది.

               కొందరు రహదారి పొడవునా దుమ్ము చీపుళ్ళతో శుభ్రం చేస్తుండగా కొంతమంది తుక్కును ట్రాక్టర్ లో లోడ్ చేశారు. దుమ్ము ధూళిని రోడ్డు ప్రక్కన గుంతలలో వేశారు.

               6 గంటల వరకూ పని చేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పని విరమించి కాఫీ సేవించిన పిదప సమీక్షలో “తాతినేని రమణ” గారు (మొక్కల రమణ) పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టారు.

               రేపు కలవవలసిన ప్రాంతం – ఈ బందరు రోడ్ లోని రిజిస్ట్రారు ఆఫీస్ వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజాగాయకుడు

  03.11.2025.

స్నేహ దాసరి, వరుణ్ దాసరి

చిన్న వయసున మంచి ట్రస్టున సభ్యులై నడిపించుచుండిన -

ఆర్థికముగా ఆదుకొనిన - దైహికమ్ముగ పాలుగొనిన

స్నేహ దాసరి, వరుణ్ దాసరి సేవలను ప్రస్తుతిస్తున్నా

కుమార్, దివ్యల సమాజ బాధ్యత కూడ నేను గౌరవిస్తా!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    03.11.2025